calender_icon.png 12 August, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబీమా దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు

12-08-2025 12:14:29 AM

  1. రేపటితో గడువు పూర్తి
  2. వరుస సెలవుల నేపథ్యంలో గడువు పెంచాలంటున్న రైతులు

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రైతు బీమా దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు ఇంకా రెండు రోజులే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ గత ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 13వ తేదీ (బుధవారం) చివరి గడువు. ఈ అవకాశాన్ని కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేస్తున్నది.

రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు తీసుకుని వెంటనే వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అందజేయాలని సూచిస్తున్నది. ఈ ఏడాది జూన్ 5వ తేదీలోపు పాస్ బుక్ వచ్చిన రైతులు అర్హులని, వారు 1966 నుంచి 2007 ఆగస్టు 14లోపు పుట్టిన వారై ఉండాలని స్పష్టం చేసింది.

మరోవైపు వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత శని, ఆదివారాలు సెలవలు వచ్చాయని, దీంతో తాము దరఖాస్తులు చేసుకోలేకపోయామని కొందరు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మరో వారం, పదిరోజులు గడువు పెంచితే, మరింత మందికి పథకం వర్తిస్తుందని, ఈ మేరకు సర్కార్ ప్రకటన విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.