ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ మృతి
సుచిర్ బాలాజీ మరణంపై అనుమానాలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్(ప్రజావేగు) సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. భారత సంతతికి చెందిన బాలాజీ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివాసముంటున్నారు. గతనెల 26న బాలాజీ చనిపోగా.. తాజాగా ఈ విషయం వెలుగుచూసింది. ప్రాథమిక విచారణ అనంత రం బాలాజీది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు.
ఘటన వద్ద ఎలాంటి అనుమానా స్పద వస్తువులు లభించలేదని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ చేస్తున్న ఆపరేషన్లు, ఆ సంస్థ అవలంబిస్తున్న విధానాలు ఆందోళనక రంగా ఉన్నాయని గతంలో తన పరిశోధనల ద్వారా బాలాజీ వెల్లడించారు. ఓపెన్ ఏఐ కాపీరైట్లను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన మూడు నెలల అనంతరం బాలాజీ మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది.
బాలాజీ 2020 నవంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు ఓపెన్ ఏఐ లో పనిచేశారు. సమాజానికి మేలుకంటే హాని చేసే టెక్నాలజీల కోసం తాను ఇక పనిచేయనని, అందుకే ఓపెన్ ఏఐను వీడానని గతంలో బాలాజీ న్యూయార్క్ టైమ్స్‌తో పేర్కొన్నారు.






