కాసులు కురిపిస్తున్న ఓపెన్ బార్లు!
- ఆర్సీపురంలో పార్కింగ్ పేర వైన్స్ మాఫియా దందా
- ఐపీఎల్ మ్యాచ్ల పేర భారీ స్క్రీన్ల ఏర్పాటు
- పర్మిట్ గదులకు మించి విస్తరణ
- కార్ల వద్దకే మద్యం సరఫరా
- మామూళ్ళ మత్తులో ఆబ్కారీ శాఖ
పటాన్చెరు, ఏప్రిల్ 14 : మామూళ్ళ మత్తులో అధికారులు తూగుతుండగా మద్యం దుకాణ వ్యాపారులు ఇష్టారీతిగా దందా కొనసాగిస్తూ భారీ స్థాయిలో వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. నిబంధనలను పక్కనబెట్టి వైన్స్ మాఫియా పెట్రేగిపోతుంది. రామచంద్రపురం మండల పరిధిలో వైన్స్ షాపుల చుట్టూ జరుగుతున్న అక్రమాలు రోజురోజుకూ బహిరంగ రూపం దాల్చుతున్నాయి.
పార్కింగ్ పేరుతో చూపిస్తున్న ప్రదేశాలు పూర్తిస్థాయి ఓపెన్ బార్లుగా మారిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల్లో కూర్చొని మద్యం సేవించడం, కార్ల దగ్గరకే మద్యం సరఫరా చేయడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారినట్లు చెబుతున్నారు.
ఐపీఎల్ పేర భారీ స్క్రీన్లు..
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ఆసరాగా చేసుకుని ఓపెన్ ప్లేస్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. మ్యాచ్ల వీక్షణ పేరుతో టేబుళ్లను, కుర్చీలు ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం సేవనానికి అవకాశం కల్పిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రాత్రివేళల్లో పెద్ద ఎత్తున గుంపులుగా చేరి హంగామా చేస్తున్నట్లు చెబుతున్నారు.
మినీ బార్లను తలపిస్తున్న మద్యం దుకాణాలు..
కొన్ని వైన్స్ షాపులు పర్మిట్ గదుల పరిమితులను పట్టించుకోకుండా పెద్ద హాళ్లు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో మద్యం ప్రియులను కూర్చోబెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. భారీ స్థాయిలో షెడ్లను ఏర్పాటు చేసి మినీ బార్లుగా తీర్చిదిద్ది మద్యం ప్రియుల జేబులు గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేగాకుండా పార్కింగ్ స్థలాల్లో కార్లలోనే మద్యం సేవించడం, షాప్ సిబ్బంది కార్ల దగ్గరకే వెళ్లి మద్యం అందించడం బహిరంగంగా కొనసాగుతుంది. ఇది చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం యజమానులు ధనార్జనే ధ్యేయంగా ఇష్టారీతిగా అమ్మకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
షరా మామూళ్ళే అంటున్న అబ్కారీ శాఖ..
మద్యం వ్యాపారులు బహిరంగంగా అక్రమాలకు పాల్పడుతున్నాఅబ్కారీ శాఖ షరా మామూళ్ళే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. నెలవారీగా సంబంధిత అధికారులకు పెద్ద ఎత్తున మామూళ్ళు అందుతున్నాయని, అందుకే మద్యం దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విజిలెన్స్ అధికారులతో పాటు ఎక్సైజ్, పోలీసు అధికారులు వెంటనే ప్రత్యేక తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






