3 August, 2026 | 4:31 PM

ఆర్టీసీ ఖాతాలను తెరవండి

22-06-2024 12:05 AM

పీఎఫ్ ఆఫీసర్లకు హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాం తి): ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు చెల్లించడం లేదంటూ ఫ్రీజ్ చేసిన టీజీఎస్‌ఆర్టీసీ బ్యాంక్ ఖాతాలను వెంటనే తెరవాలని పీఎఫ్ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. రూ.940 కోట్ల పీఎఫ్ బకాయిలు పేరుకుపోవడంతో ఆర్టీసీకి చెందిన బ్యాంక్ ఖాతాలను పీఎఫ్ అధికారులు ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలకు నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ రవాణా అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఆర్టీసీ తరఫున ఏఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి పీఎఫ్ బకాయిలు ఉన్నాయి. 2014లో టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ విడిపోయా యి. విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పీఎఫ్ అధికారులు ఒక్క టీజీఎస్ ఆర్టీసీ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం సరికాదు. ఆర్టీసీ విభజన జరిగినా ఈపీఎఫ్ విభజన ఇంకా జరగలేదు. ఇంకా ఏపీఎస్ ఆర్టీసీ పేరుపైనే పీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. ఈ బకాయిలపై ఇరు రాష్ట్రాలు చర్చలు జరుపుతుండగానే అధికారులు అకౌంట్లు ఫ్రీజ్ చేయడం చట్టపరంగా సమర్థనీయం కాదు. 2014 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ వరకు పీఎఫ్ అంచనాల్లోనూ లోపాలున్నాయి. పీఎఫ్ నగదు చెల్లింపులో టీజీఎస్‌ఆర్టీసీ ఆలస్యం చేయలేదు. ఒకవేళ జరిగినా అది దీర్ఘకాలికం కాదు’అని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని రీజినల్ పీఎఫ్ కమిషనర్, రికవరీ ఆఫీసర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేశారు.