05-06-2025 12:10:31 AM
చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు బ్యాక్‌టుబ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ఈ సీనియర్ల సరసన నటించడానికి హీరోయిన్లు దొరకడం కొంచెం కష్టమే. ఎందుకంటే సీనియర్ హీరోలతో జోడీ కట్టేందుకు కొద్దిగా ఆలోచిస్తుంటారు యంగ్ బ్యూటీలు. అయితే ఆ సీనియర్లతో జత కట్టడానికి అదృష్టం కూడా ఉండాలి.
అలాంటి అదృష్టము, అవకాశము ఆషికా రంగనాథ్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయా? అంటే ఔనని చెప్పక తప్పని పరిస్థితి! ఔను, ఈ ముద్దుగుమ్మ వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లోనే ఛాన్సులు కొట్టేస్తోంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జునలతో ఆడిపాడిన ఈ అమ్మడు మరో సీనియర్ హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయిపోతోందట.
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన ‘అమిగోస్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆషికా ఆ సినిమాతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో కలిసి ‘నా సామిరంగ’ అంటూ 2024 సంక్రాంతికి ప్రేక్షకులను పలుకరిచింది. ఇప్పుడు ‘విశ్వంభర’లో మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకోనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పూర్తికాకముందే మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.
రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయకిగా ఆషికా ఎంపికైందని సమాచారం. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తిరుమల కిశోర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు మాస్ మహారాజ. ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలోనే ఆషికా రంగనాథ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తోంది.