6 July, 2026 | 7:57 AM

ఆరేంజ్ ఆర్మీ..

20-05-2024 02:48 AM

 ఖేల్ ప్రతినిధి: గత సీజన్‌లతో పోలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సారి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో ‘డేవిడ్ భాయ్’ అని ప్రేక్షకులు బాగా సందడి చేసేవాళ్లు! మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. గతంలో ఓ మాదిరి స్కోర్లను కాపాడుకోవడంలో ధిట్టగా ముద్ర పడ్డ రైజర్స్.. ఈసారి లీగ్‌లోనే అత్యంత ప్రమాదక జట్టుగా ఎదిగింది. ‘మనల్ని చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారు. మైదానంలో అడుగు పెట్టడానికి ముందే వారు కంగారు పడిపోతున్నారు’ అని సీజన్ మధ్యలో హైదరాబాద్ సారథి కమిన్స్ అన్న మాటల్లో అతిశయోక్తి లేదు.

టాస్ గెలిచి సన్‌రైజర్స్‌కు బ్యాటింగ్ అప్పచెబితే ఇక ఖతమే అన్న తరహాలో రైజర్స్ విజృంభించింది. అయితే పేరులో హైదరాబాద్ అని ఉండటం తప్ప స్థానికంగా పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయిన సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో అనూహ్య మద్దతు లభించింది. మినీ వేలంలో కమిన్స్, హెడ్‌ను కొనుగోలు చేసుకున్నప్పటి నుంచే రైజర్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగగా.. ఇక డగౌట్ నుంచి జట్టు యజమాని కావ్య మారన్ కూడా ప్లేయర్లలో ఉత్సాహాన్ని నింపింది. గతంలో ఉప్పల్‌లో మ్యాచ్ జరిగితేనే కష్టకష్టంగా మైదానం నిండేది.. కానీ, ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా సన్‌రైజర్స్ బరిలోకి దిగే మ్యాచ్‌ల టికెట్లు ఆన్‌లైన్‌లో కొందాం అంటే మచ్చుకైనా కనిపించలేదు.

స్టేడియం మొత్తం నారింజ రంగులో ఎటు చూసినా.. “ఎస్ ఆర్ హెచ్.. ఎస్ ఆర్ హెచ్‌” అనే నినాదాలతో మోత మోగిపోయింది. అందుకు తగ్గట్లే.. రైజర్స్ బ్యాటర్లు కూడా భారీ షాట్లతో చెలరేగి పదే పదే బంతిని అభిమానులకు చేరువ చేశారు. అభిషేక్, హెడ్, క్లాసెన్, నితీశ్, సమద్ మెరుపులతో ఫ్యాన్స్ మైమరిచిపోయారు. ఇక నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో సన్‌రైజర్స్‌కు ఆణిముత్యంలాంటి తెలుగు కుర్రాడు లభించాడు.

అటు మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు.. ఇటు ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా అతడిని చూస్తుండగానే జట్టులో కీలక ప్లేయర్‌గా మార్చింది. వచ్చే ఏడాది మేగా వేలం జరగనున్న నేపథ్యంలో రైజర్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో కమిన్స్, హెడ్, అభిషేక్, క్లాసెన్‌తో పాటు నితీశ్ కూడా పోటీలో ఉండే విధంగానే కనిపిస్తున్నాడు. కేవలం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లకే కాక.. ముంబై, ఢిల్లీలో సన్‌రైజర్స్ ఆడిన మ్యాచ్‌లకు కూడా ఆరెంజ్ ఆర్మీ పోటెత్తింది. అందుకే చివరి మ్యాచ్ అనంతరం కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. జట్టు సభ్యులంతా ఉప్పల్ మైదానమంతా కలియదిరుగుతూ.. తమకు అండగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.