8 April, 2026 | 4:10 AM

మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

08-04-2026 01:34 AM
  1. ఒకే సంస్థ ఒకే సర్వీస్ అమలు చేయాలి
  2. ఉద్యోగ భద్రత కల్పించాలి: విద్యుత్ కార్మికులు
  3. హనుమకొండ ఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ ఎదుట మహా ధర్నా
  4. విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ 
  5. ఆందోళనకు మద్దతు పలికిన పలు కార్మిక సంఘాల నేతలు

మహబూబాబాద్/ హనుమకొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా అమలులో కీలకపాత్ర వహిస్తున్న ఆన్ మ్యాన్, పీస్ రేట్, ఆర్టిజన్ విద్యుత్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని, ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ ఎన్‌పీడీసీ ఎల్ కార్పొరేట్ ఆఫీస్ ఎదుట విద్యుత్ కార్మికులు మహా ధర్నా నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, కన్వీనర్లు హెచ్. శ్రీకాంత్, దమ్మ రవీందర్, అటికేటి రవీందర్ ఆధ్వర్యంలో వందలాదిమంది విద్యుత్ కార్మికులు తరలివచ్చి పబ్లిక్ గార్డెన్ నుంచి ర్యాలీ నిర్వహించి కార్పొరేట్ ఆఫీస్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.వివిధ కార్మిక సంఘాల నేతలు విద్యుత్ కార్మికుల నిరసనకు మద్దతు పలికారు.

ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు, అధికారుల సంఘాలకు సంబంధించిన 327 యూనియన్ నేత ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులకు రావలసిన ఏపీఎస్‌ఈబీ రూల్స్ తక్షణమే అమలు చేయాలని, స్పాట్ బిల్లర్ కార్మికుల్ని కనీస వేతనం అమలు చేసి వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.1104 యూనియన్ నేత సాయిబాబా మాట్లాడుతూ కార్మికులకు విద్యార్హతను బట్టి తక్షణమే కన్వర్షన్ చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

టీఆర్‌ఎస్ కేవీ నేత జాన్సన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీఎంఎస్ రాష్ట్ర సెక్రెటరీ ఎం.శశి కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులకు తీరని అన్యాయం చేసిందని, కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని పండిపడ్డారు.

1535 యూనియన్ నేత వజీర్ మాట్లాడుతూ రాష్ట్ర పరిధిలోని ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ట్రాన్స్‌కో, జెన్కో పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేసి తక్షణమే రెగ్యులర్ చేయాలని డి మాండ్ చేశారు. సీఐటీయూ నేత ఈశ్వర్ మాట్లాడుతూ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ఏఈ జేఏసీ చైర్మన్, కన్వీనర్, కో కన్వీనర్లు సతీష్ రెడ్డి, సాయి లు, చంద్రా రెడ్డి, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్, ప్ర శాంత్, వెంక న్న తదితరులు మాట్లాడుతూ డిమాండ్లు నెరవేర్చకపోతే బుధవారం ఉదయం 9 గంటల నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.