18 June, 2026 | 1:44 AM

పేదలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు

18-06-2026 12:00 AM
  1. బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేష్
  2. పేదల గుండెల్లో భయం నింపే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు

సికింద్రాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): నలభై సంవత్సరాలకు పైగా ప్రశాంతంగా జీవిస్తున్న మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్, వార్డు నెం.3లోని పేద ప్రజల మధ్యకు అధికారులు వచ్చి అత్యంత దుర్మార్గంగా వ్యవహరించడం పట్ల బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి భయాందోళనలకు గురైన ప్రజలు తమ వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేయడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించినట్లు  ఆయన తెలిపారు.

ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వారికి అండగా బీఆర్‌ఎస్ పార్టీ బలంగా నిలుస్తుందని గజ్జెల నగేష్ స్పష్టం చేశారు.కేసీఆర్  జెండా మీకు అండగా ఉంది. కేటీఆర్  మీ వెంటే ఉన్నారు. నలభై సంవత్సరాలుగా మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్లోసర్వే నెంబర్170లో 539 గుడిసెలు లో ఉంటున్న1300 ఓట్లు హక్కు గల జనాభా, 1500 మంది నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న పేదలను ఇబ్బందులకు గురిచేయడం అమానుషం, అధికారులను అడ్డుపెట్టుకుని పేదల గుండెల్లో భయం నింపే ప్రయత్నాలను బీఆర్‌ఎస్ పార్టీ ఏమాత్రం సహించేదిలేదన్నారు.

ప్రభుత్వం నిజంగా పేదల అభివృద్ధి కోసం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుపడం.అయితే దశాబ్దాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న పేద కుటుంబాలను రోడ్డున పడేయకుండా, వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించేలా ముందుగా ప్రభుత్వ గృహాలను కేటాయించాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గానీ, ప్రత్యామ్నాయ నివాస సదుపాయం గానీ కల్పించిన అనంతరం ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

కానీ ప్రత్యామ్నాయ నివాసం కల్పించకుండా అధికారులను పంపించి పేదలతో ఇళ్లు ఖాళీ చేసుకుని వెళ్లిపోవాలి’అని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ పేద వ్యతిరేక, నిరంకుశ వైఖరికి నిదర్శనం.పేదల ఇళ్లపై చేయి వేయాలని చూస్తే ప్రజలను వెంటబెట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. పేద ప్రజలకు అన్యాయం జరిగితే బీఆర్‌ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. పేదలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు అని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నగేష్ హెచ్చరించారు.

స్థానిక ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వారికి అండగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుందని గజ్జెల నగేష్ భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పేదల ఇళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్,జంగ్లీ రాజు, స్థానిక నివాసితులు వెంకట రాములు,నాగమణి, తులసి, జంగమ్మ, యాదమ్మ, లక్ష్మణ్, అశోక్, కంకయ్య, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.