18 June, 2026 | 1:51 AM

డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి

18-06-2026 12:00 AM

పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ 

జిన్నారం/అమీన్ పూర్, జూన్ 17 : ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముకలని, కళాశాల స్థాయి నుంచే డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు విద్యార్థుల కోరిక మేరకు అతి త్వరలో బెంచీలు అందచేస్తానని హామీ ఇచ్చారు. 

శివాలయం అభివృద్ధికి రూ.36 లక్షల విరాళం

జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ జీవన జ్యోతిర్లింగం శివాలయం అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆలయం ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక శివాలయం మండప నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. మండప నిర్మాణానికి 36 లక్షల రూపాయల సొంత నిధులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో అభివృద్ధి..

గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని, త్వరలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఖాజిపల్లి పరిధిలోని జిఎంఆర్ కాలనీ, జర్నలిస్ట్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రధానంగా సర్వేనెంబర్ 181 లో ప్రజల సౌకర్యార్థం గుడి, మసీదు, చర్చి, స్మశాన వాటిక, అంగన్వాడి, చట్ పూజ ఘాట్, క్రీడా మైదానం, ప్రాథమిక పాఠశాల నిర్మాణాలకు త్వరలో స్థలాలు కేటాయించి..భవన నిర్మాణాల పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ కాలనీలో సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం జిఎంఆర్ కాలనీలో గ్రామ దేవత గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ముదిరాజ్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి,  మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్, తహసిల్దార్ ఆంథోనీ, మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, వెంకటేష్ గౌడ్,కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.