18 June, 2026 | 1:53 AM

ప్రధాన రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతా లోపాలు

18-06-2026 12:00 AM

సీపీఐ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటపల్లి శంకర్                               

జవహర్ నగర్, జూన్ 17 (విజయక్రాంతి): జవహర్ నగర్ ప్రధాన రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్రమైన నాణ్యత లోపాలు జరుగుతున్నాయని డిస్మెంటల్ మెటీరియల్ తో రోడ్డు మరమ్మత్తులు జరుపుతున్నారని దీనిపై వెంటనే విచారణ జరిపించాలని సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటపల్లి శంకర్ డిమాండ్ చేశారు.

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో జవహర్ నగర్ నుండి చెన్నాపూర్ వెళ్లే 100 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణ మరమ్మత్తు పనుల్లో తీవ్రమైన నాణ్యత లోపాలు జరుగుతున్నాయని సిపిఐ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటపల్లి శంకర్ ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సిపిఐ నాయకత్వ బృందం జవహర్ నగర్ చెన్నాపురం ప్రధాన రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించిందని రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే అలాగే వదిలేసి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం అధికారుల బాధ్యతరాహిత్యానికి నిదర్శనం అన్నారు. నెలల తరబడి ఈ రోడ్డు విస్తరణ పనులు సాగదీయడం వల్ల నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల ప్రాణాలతో ఆటలాడడం తగదని ద్వజమెత్తారు.

పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో సైకిళ్లపై వెళ్లే విద్యార్థులు రోడ్డు దుస్థితి  కారణంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని తమ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు పనుల ఆలస్యం వల్ల లేస్తున్న దుమ్ము ధూళితో స్థానిక ప్రజలు ప్రయాణికులు తీవ్రమైన శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నిమ్మల నరసింహులు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ అన్వర్, సిపిఐ కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూపానాయక్, సిహెచ్. మాధవి, డి. మల్లిక తదితరులు పాల్గొన్నారు.