ఎంఐఎం భయంతోనే!

16-09-2026 | 05:25am

విమోచన ఉత్సవాలకు కాంగ్రెస్ దూరం 

ఓటు బ్యాంకు రాజకీయాల్లో అధికార పార్టీ 

మహారాష్ట్ర, కర్ణాటకలో చేస్తుంటే ఇక్కడెందుకు చేయరు?: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విమోచన చరిత్రను జెన్ జీ, జెన్ ఆల్ఫా తెలుసుకోవాలి: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్/సికింద్రాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఎంఐఎం పార్టీ(MIM Party)కి భయపడి, ఓటు బ్యాంకు రాజకీయాల(Vote bank politics)కు తలొగ్గే గత బీఆర్‌ఎస్(BRS), ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు(Congress governments) సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) అధికారికంగా నిర్వహించడానికి వెనుకాడుతున్నాయని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. విమోచన దినోత్సవాన్ని పుర స్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి(Mekala Shilpa Reddy) ఆధ్వర్యంలో మంగళవారం ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ(Women Power Scooty Rally)’ నిర్వహించారు.

ఈ ర్యాలీని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ప్రారంభించారు. అంతకుముందు కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌ను సందర్శించారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. త్రివిధ దళాల కవాత రిహార్సల్స్‌ను తిలకించారు. అక్కడి నుంచి చార్మినార్ చేరుకున్న కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు.. భాగ్యలక్ష్మి అమ్మ వారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. తర్వాత ర్యాలీని ప్రారంభించారు.

భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి మొదలైన ర్యాలీ అసెంబ్లీ ఆవరణలోని సర్దార్ వల్లభభాయ్‌పటేల్ విగ్ర హం వరకు సాగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం సైన్యం, రజాకార్లు సాగించిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలను తెలంగాణ మహిళలు ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలోని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విముక్తి దినోత్సవాలు జరుపుతుంటే, నిజాం కేంద్రమైన హైదరాబాద్‌లో గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వ హించకపోవడం శోచనీయమన్నారు.

సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ లిబరేషన్ డే (హైదరాబాద్ ముక్తి దినోత్సవం)’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకులకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇంకా కేంద్ర సంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, తెలంగాణ గవర్నర్, పలువురు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.

అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ రజాకార్ల వారసులైన ఎంఐఎంకు తలొగ్గి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన చరిత్రను మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. నాటి పోరాటాలు, త్యాగాలను నేటి నవతరం (జెన్-జీ, జెన్- ఆల్ఫా) తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటీష్ పాలన నుంచి స్వాతంత్య్రం సిద్ధిస్తున్న సమయంలో హైదరాబాద్‌ను ప్రత్యేక రాజ్యంగా ‘ఉస్మానిస్తాన్’గా మార్చి పాకిస్తాన్‌తో కలపాలని నిజాం కుట్రపన్నారని విమర్శించారు.

తెలంగాణ బిడ్డలు ఎంతో ధైర్యంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవకూడదన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఆడబిడ్డ ధైర్యానికి, ఆత్మగౌరవానికి మారుపేరని కొనియాడారు. నాడు రజాకార్ల దురాగతాలను రోకలిబండలు, కారపు ముద్దలతో ఎదిరించిన వీరనారీమణుల పోరాటపటిమే నేటి మహిళా సమాజానికి ఆదర్శమన్నారు. 

మరిన్ని వార్తలు