రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* ఐకేపీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
* ఆమనగల్లులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
ఆమనగల్లు,(విజయక్రాంతి): రైతన్నలు ఆష్టకష్టాలు పడి పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పిఎసిఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని వారు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, రైతులు తాము పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. "దళారుల మాయమాటలు నమ్మి రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరను (MSP) పొందడమే మీ హక్కు" అని ఆయన పిలుపునిచ్చారు.
* వ్యవసాయ రంగానికి ‘రేవంత్’ సర్కార్ పెద్దపీట
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు మద్దతు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని చెప్పారు.కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎండ తగలకుండా నీడ, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
తూకంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, పీసీసీ స్పోక్స్ పర్సన్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం కేశవులు, శ్రీనివాస్ గౌడ్, యాట నరసింహ, పత్య నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సంపత్, శ్రీశైలం, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






