13 May, 2026 | 1:30 AM

వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

13-05-2026 12:02 AM

వర్షం పడితే పెద్దమొత్తంలో రైతులకు పంట నష్టం

సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి, మే 12 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ టెలిఫోన్ లో ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోళ్ళపై మంత్రి కలెక్టర్ తో చర్చించారు. కొనుగోలు  కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.

జిల్లా పౌరసరఫరాల అధికారులు, ఐకేపీ, సహకార సంఘాలతో పాటు రవాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని వరి ధాన్యంను శరవేగంగా కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదురు చూడకుండా చూడాలని చెప్పారు. వర్షం కురిస్తే రైతులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.