15 April, 2026 | 9:04 AM

ఐకెపి ద్వారా కేటాయించబడిన అన్ని వరి కొనుగోలు కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభించాలి

29-10-2025 05:57 PM

బాల్య వివాహాలపై అరికట్టేందుకు నవంబర్ 14న  అవగాహన సదస్సు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఐకెపి సభ్యులకు కేటాయించిన అన్ని కొనుగోలు కేంద్రాలను రెండ్రోజుల్లో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఐకెపి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అవసరమైన తూకం యంత్రాలు తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్ లు తదితర పరికరాలను మార్కెటింగ్ శాఖ నుండి తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే శిక్షణ పొందిన సిబ్బంది ఖచ్చితంగా ఉండాలని అలా కాకుండా శిక్షణ పొందని వ్యక్తిని పెట్టీ కొనుగోలు చేస్తే సంబంధిత ఎపియంపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ధాన్యం సేకరణ విషయంలో రాజీ పడవద్దని, నియమ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలని, అందుకు రైతులకు సైతం తేమ, తాలు విషయంలో  అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా అరికట్టడానికి నవంబర్ 14న అన్ని మండల కేంద్రాల్లో మహిళా సంఘాల సభ్యులతో, గ్రామ పెద్దలు, కుల పెద్దలతో అవగాహన కార్యక్రమం చేపట్టాలని, బాల్య వివాహం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరిగే అవకాశం ఉంటే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబరు కు సమాచారం ఇచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. 

విద్యాలయాల నుండి మధ్యలోనే చదువు మానేసిన అమ్మాయిల జాబితా ఇవ్వడం జరిగిందని, జాబితా ప్రకారం ఇళ్లకు వెళ్ళి అమ్మాయి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి విద్యాలయాల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎ.పి.యం లను ఆదేశించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతి మండలం నుండి స్వయం సహాయక సభ్యులకు కనీసం ఒక యూనిట్ నెలకొల్పే విధంగా ఎ.పి.యం లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోడానికి మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయించాలని తద్వారా వారు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు పొంది ఇల్లు నిర్మించుకుంటారని తెలియజేశారు. ఎక్కడైనా బ్యాంకర్లతో సమస్యలు ఉంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. పిడి డిఆర్డిఓ ఉమాదేవి లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ సహయ లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయి, డి.పి.యంలో, ఎపియంలు తదితరులు పాల్గొన్నారు.