17-12-2024 02:37:13 AM
౧౭ వేల కి.మీ. మేర నిర్మాణం: మంత్రి సీతక్క
హైదరాబాద్, డిసెంబర్ ౧౬ (విజయక్రాంతి): సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు అని, రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో ప్రతి పంచాయతీకి రోడ్డు నిర్మించేం దుకు ప్రభుత్వం రూ.12 వేల కోట్లను కేటాయించినట్లు పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శాసనసభలో పంచాయతీ బీటీ రోడ్ల అభివృద్ధిపై జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. రోడ్లు లేనటువంటి ప్రాంతాలు ఎలా ఉంటాయి? అభివృద్ధి విషయంలో ఎలా వెనకబడి ఉంటాయనడానికి తాను పుట్టి, పెరిగిన ఆదివాసీ గూడేలే నిదర్శనమని పేర్కొన్నారు.
వెనుకబడిన ప్రాంతాలకు రోడ్లు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని.. అందుకే వచ్చే నాలుగేళ్లలో పంచాయతీల్లో రోడ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లను కేటాయించినట్టు వివరించారు. మొత్తం 17 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తామని స్పష్టంచేశారు. ఈ ఏడాది సీఆర్‌ఆర్ కింద ఇప్పటికే రూ.2,311 కోట్లతో 2,400 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ నడుస్తోందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లను నిర్మిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా సిద్ధం చేసినట్టు వివరించారు.
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ రోడ్ల కోసం కేవలం రూ.2,200 కోట్లే కేటాయించిందని విమర్శించారు. ఇప్పుడు ఆ రోడ్లు గుంతలుగా మారాయని పేర్కొన్నారు. వైల్డ్ లైఫ్ ఏరియాల్లో రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెప్పారు. ప్రతి జీపీ నుంచి మండల కేంద్రానికి రోడ్ల నిర్మాణం చేపడుతామని వివరించారు.