17-12-2024 02:35:10 AM
* డిశ్ఛార్జికి హైకోర్టు నిరాకరణ
* మరో పిటిషన్‌లో హాజరుకు మినహాయింపు
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2017లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియలో అధికారులను అడ్డుకున్నారంటూ నమోదైన కేసును డిశ్ఛార్జి చేయాలంటూ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. అభియోగాల నమోదు ప్రక్రియలో భాగంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
అయితే, ఇదే కేసుకు సంబంధించి శ్రీధర్‌బాబు దాఖలు చేసిన మరో పిటిషన్‌లో కింది కోర్టు విచారణకు సంబంధించి హాజరు మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 2017లో రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కుర్చీలను విరగ్గొట్టి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై నిరసనగా నినాదాలు చేశారు. దీనిపై తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కారుగంటి మల్లికార్జున ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో 2017 ఆగస్టు 23న శ్రీధర్‌బాబు, హెచ్ వేణుగోపాల్‌రావు, కొత్త శ్రీనివాస్, క్రాంతి, పోలు శివ, యు శ్రీనివాస్‌తోపాటు మరో 300 మందిపై కేసు నమోదైంది. ఈ కేసు అనంతరం హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. తనపై అక్రమంగా నమోదైన కేసులో పేరును తొలగించాలని కోరుతూ శ్రీధర్‌బాబు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల కోర్టు నవంబరు 22న కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ శ్రీధర్‌బాబు హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖ లు చేశారు.
దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మేశ్ జైశ్వాల్ వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్‌పై కేసు నమోదు చేయడానికి ఆధారా ల్లేవని అన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్‌పై ఆరోపణలు తీవ్రంగా ఉన్నందున అభియోగాల నమోదు ప్రక్రియను ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంటూ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేశారు.
ఇదే కేసు ను కొట్టివేయాలని కోరుతూ శ్రీధర్‌బాబు దాఖలు చేసిన మరో పిటిషన్‌ఫై విచారణ చేపట్టిన జస్టిస్ కే లక్ష్మణ్ పోలీసులతోపాటు ఫిర్యాదుదారు అయిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కే మల్లికార్జున ప్రసాద్‌కు నోటీసులు జారీచేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 6కు వాయిదా వేశారు. అయితే ఈ కేసులో కింది కోర్టులో హాజరు నుంచి మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.