15-05-2025 10:24:23 AM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సరస్వతి పుష్కరాల్లో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ముందుగా ముఖ్యమంత్రి హైదరాబాదులో ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం,సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కర ఉత్సవాలకు బయల్దేరుతారు. సాయంత్రం 5.20కి సరస్వతి పుష్కర ఘాట్లో త్రివేణి సంఘంలో స్నానం ఆచరించి, పుష్కరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
అనంతరం పుష్కరాలలో భాగంగా ఏర్పాటు చేసిన 17 అడుగుల శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో అభిషేకాలు పూజలు శుభానందదేవి అమ్మవారికి అర్చనలు, శ్రీ సరస్వతి దేవి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6.40 కి ను సరస్వతి ఘాట్ లో కాశీ వేద పండితుల ద్వారా నిర్వహించే సరస్వతీ నవ రత్నమాల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 7.30 పుష్కరాలకు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రాత్రి 8 గంటలకు కాళేశ్వరం నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతారు. ఈ కార్యక్రమాలలో దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్సింగ్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ, తదితరులు పాల్గొననున్నారు.