02-02-2026 08:12:08 PM
కార్యాలయం ముందు నిరసన
మణుగూరు,(విజయక్రాంతి): మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ సమితి సింగారంలో పంచాయతీ కార్మికులు జీతాల కోసం ధర్నాకు దిగారు. పంచాయతీలో 33 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో కొంత మందికి 11 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, మిగిలిన వారికి మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. తమకు జీతాలు ఇవ్వాలని పలు మార్లు డిమాండ్ చేసినా ఇవ్వకపోవడంతో సోమవారం పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
కార్యాలయం గేటు ముందు కూర్చొని జీతాలు వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల నిరసనకు సిపిఐ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి దుర్గాల సుధాకర్, జంగం మోహన్ రావు మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా పంచాయతీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
11 నెలల వేతనాలు బకాయి ఉన్నాయని చెప్పారు. దింతో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోవడం దుర్భరంగా మారిందన్నారు. కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు మంగి వీరయ్య, వార్డు మెంబర్లు వెంకటేశ్వర్లు, వేరుపుల నరేష్ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.