పోరాటానికి ప్రతీక పాపన్నగౌడ్
350 ఏళ్ల క్రితం.. బహుజన జాతులను ఏకం చేసి తెలంగాణలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకొన్న పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అగ్రవర్ణ జమీందారుల గడీల దొరలను గడగడలాడించి 21 కోటలు అక్రమించారు. ఖీల షాపూర్ నుంచి మొదలు పెట్టి తాటికొండ, వేములకొండ, భువనగిరి, కొలనుపాక, జాఫర్‌గడ్, చేర్యాల్, భైరన్‌పల్లి, సర్వాయిపేట, వరంగల్, హుస్నాబాద్, హుజురాబాద్, కరీంనగర్, జనగామ, నల్గొండ ప్రాంతాల్లో తన రాజ్యాన్ని విస్తరించి పరిపాల సాగించిన గొప్ప బహుజన చక్రవర్తి పాపన్న.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగాం జిల్లా రఘునాధ పల్లి మండలం ఖిలాశాపూర్‌లో 1650 ఆగస్టు 18న ధర్మన్న, సర్వాయమ్మ పుణ్య దంపతులకు ఆయన జన్మించారు. గౌడ కులంలో పుట్టిన పాపన్న యుక్త వయస్సు రాగానే తన కులవృతైన తాళ్లు ఎక్కుతు కల్లు అమ్ముతు కల్లు మండవలో తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, దూదేకుల మీర్ సాహెబ్, కొత్వాల్‌కు కల్లు పోస్తు అందరితో కలివిడిగా ఉండేవాడు.
ఒకరోజు గోల్కొండ నవాబు తురుష్క సైనికులు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా పోతుంటే.. పైకం కట్టాలని పాపన్న స్నేహితులు అడిగారు. ‘మేము.. రాజు గారి సైనికులం మమ్మలనే అడుగుతారా’ అని పాపన్న స్నేహితులపై సైనికులు చేయి చేసుకుంటారు. అది సహించలేని పాపన్న కోపంతో వారితో యుద్ధం చేసి కల్లు గీసే కత్తితో కొందరిని చంపుతాడు. కొందరు గోల్కొండ నవాబుతో జరిగిన సంఘటన చెబుతారు.
దీనిని గమనించి పాపన్న రాజ్యధికారం వైపు అడుగులు వేస్తారు. వివిధ కులాలకు సంబంధించిన 12 మంది స్నేహితులతో మొద ట సైన్యాన్ని తయారుచేసుకొంటారు. తర్వాత కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట దగ్గర నాలుగు వేల ఎకరాల కొమ్ముగుట్టను స్థావరంగా చేసుకొని మూడు వేల మంది సైన్యాన్ని తయారుచేసి వారందరికీ గెరిల్లా శిక్షణ ఇచ్చి యుద్ధవీరులుగా తయారు చేశారు.
గడీల దొరల దగ్గర ధనం కొల్లగొట్టి నిరుపేదలకు పంచేవాడు. దానితో జమీందారులు పాపన్నను బందిపోటు దొంగగా చిత్రీకరించారు. పాపన్న క్రమక్రమంగా 21 కోట గడీలు ఆక్రమించుకున్నారు. 20 ఏండ్లు పరిపాలించి ఏకంగా గోల్కొండపై దండయాత్ర చేసి ఏడు నెలలు పరిపాలించారు. 1707లో ఔరంగాజేబు మరణించిన తర్వాత గోల్కొండలో సింహాసనాన్ని సర్వాయి పాపన్న గౌడ్ అధిష్టించారు. 1708 ఏప్రిల్ ఒకటిన వరంగల్ కోటపై దాడిచేసి పాపన్న పట్టుబడ్డారు. శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న గౌడ్ తన బాకుతో గుండెల్లో పొడుచుకుని చనిపోయారు.
లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న చరిత్రపై అధ్యయనం చేయించి పుస్తకాలను ముద్రించింది. పాపన్న గౌడ్ ముఖచిత్రంతో కేంబ్రిడ్జి యూనివర్సిటీ ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అని రెండు పుస్తకాలను ముద్రించింది. బ్రిటిష్ ప్రభుత్వం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో పాపన్న గౌడ్ శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం.
అణగారిన కులంలో పుట్టిన పాపన్న చరిత్రను అగ్రవర్ణాలు ఎక్కడా రాయటానికి ఇష్టపడలేదు. స్వరాష్టంలో ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి, వర్థంతి కార్యక్రమాలు అధికారికంగా జరిపించడం అభినందనీయం.
బండి వంశీకృష్ణగౌడ్ 8688063096




