2 April, 2026 | 3:15 AM

కొత్త సమీకరణలు!

02-04-2026 12:00 AM

ప్రపంచక్రమం మారుతున్నది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భౌగోళికమైనదిగా.. అణ్వస్త్ర నిరోధానికి అన్నట్టుగా కనిపించినా పశ్చిమాసియాలో ఇంధన ఆధిపత్యం ఎవరిదనే ప్రశ్నను ముందుకుతెచ్చింది. రాడికల్ ఇస్లామిస్టు దేశంగా పశ్చిమాసియాలో భద్రతకు సవాలుగా ఇరాన్ పరిణమించిందని, క్షిపణులు, అణు కార్యక్రమంతో ఇరాన్ ఒక దుష్టదేశంగా మారిందనే వాదనతో అమెరికా ఆ దేశాన్ని ఇంతకాలం లక్ష్యం చేసుకుంది.

మతాన్ని కవచంలా తొడిగి, ఇంధన బలంతో ఇరాన్, అమెరికాకు సవాలుగా నిలిచింది. పశ్చిమాసియాలో ఈ యుద్ధం.. ఇరాన్‌లోని ఆయతుల్లాలను అంతంచేయడం, క్షిపణి, అణు కార్యక్రమాలను ఆపివేయడమేనని అమెరికా చెబుతున్నా, అది వాణిజ్య యుద్ధమేనని ప్రపంచానికి తేటతెల్లమైంది. ముడి చమురుపై ఆధిపత్యం సాధించలేకపోతే, మనుగడే కష్టమని అమెరికాకు తెలుసు. చైనాకు మరీ ఎక్కువ తెలుసు. ప్రయోజనాలు వేరైనా ఇజ్రాయెల్‌తో అమెరికా జట్టుకట్టింది. మధ్యప్రాచ్య గతిని మార్చే పథకాన్ని బహిర్గతం చేసింది.

జరుగుతున్నదేమిటి? సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ అంతం చేయగలిగినా, ఇరాన్ ఈ యుద్ధంలో తన పంథాను మార్చింది. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. అమెరికా సైనిక స్థావరాలకు గల్ఫ్ దేశాలు చోటివ్వడమే తమ ఆగ్రహానికి కారణమని ఇరాన్ చెబుతున్నా, ముడి చమురు కేంద్రాలను భగ్గుమనిపించింది. హోర్ముజ్ జలసంధిని గుప్పిటపట్టి అనేక దేశాలు ఇంధన సంక్షోభంతో విలవిలలాడేలా చేసింది. ఈ యుద్ధంతో సంబంధం లేని దేశాలకూ ఇంధన సెగ తగిలింది. హోర్ముజ్ జలసంధిలో ఇంధన రవాణా నౌకలు ఆగిపోవడంతో యుద్ధ స్వభావమే మారిపోయింది. 

మరోవైపు గల్ఫ్ దేశాల్లోని ప్రధాన ఇంధన రిఫైనరీలపై ఇరాన్ దాడులు చేయడం అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఊహించని పరిణామం. పలు దేశాలకు, మరీ ముఖ్యంగా యూరప్ దేశాలకు ఈ ఇంధన సంక్షోభం మింగుడుపడలేదు. అమెరికా మిత్రదేశాలు ఈ యుద్ధంలో తలదూర్చకుండా ప్రేక్షకపాత్ర వహించడం డొనాల్డ్ ట్రంప్‌కు ఆశనిపాతం అయ్యింది. ప్రతిరోజు విభిన్న ప్రకటనలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు యథావిథిగా ఐరోపా దేశాలపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

అయినా ఐరోపా దేశాలు ఈ యుద్ధంతో  మాకేం సంబంధం లేదు.. అది అమెరికా, ఇజ్రాయెల్‌ల తలనొప్పి అంటున్నాయి. దీంతో నాటో కూటమిపై కారాలు మిరియాలు నూరిన ట్రంప్ ఏకంగా ఆ కూటమి నుంచి అమెరికా వైదొలగనున్నట్లు కూడా ప్రకటించారు. ఏ యుద్ధాన్నీ ఆపలేకపోయిన ట్రంప్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. మధ్యప్రాచ్యంలో కొన్ని దేశాలను కలుపుకొని ఒక కూటమిని ఏర్పరచుకొనే పనిలో పడ్డారు ఇజ్రాయెల్ ప్రధాని. మొదటినుంచి ఈ యుద్ధంలో నెతన్యాహు ధోరణి భిన్నంగానే వుంది.

తమకు పంటి కింద రాయిలా, ఇరాన్ మద్దతుతో చెలరేగుతున్న హిజ్బుల్లా ఉగ్రవాదులను ఇదే సందుగా ఏరివేయడం పనిగా పెట్టుకున్నారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర దాడుల్లో లెబనాన్ దక్షిణ ప్రాంతం మరో గాజా వలె మారింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలేమిటో ప్రపంచ దేశాలకు స్పష్టమైంది. రష్యా, చైనా, ఉత్తర కొరియా ఈ పరిణామాలను మౌనంగా గమనిస్తున్నాయి.