3 May, 2026 | 5:25 AM

‘మధ్యాహ్న భోజనం’ అందేనా?

04-06-2024 12:05 AM

‘ఈ విద్యా సంవత్సరం నుండైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగేనా’ అని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 1969 విద్యా సంవత్సరం నుండి 2 సంవత్స రాల ఇంటర్మీడియట్ కోర్సును ప్రభుత్వం ప్రారంభించింది. ఇటు ఉన్నత పాఠశాలలకు, అటు డిగ్రీ కళాశాలలకు ఈ  విద్య వారధిగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. 1970లో ఇంటర్మీడియట్ విద్యను విశ్వవిద్యాలయ పరిధి నుంచి తప్పించి ప్రభుత్వ చట్ట ప్రకారం ‘ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్మీడియట్ బోర్డు’ను (1971లో) నెలకొ ల్పారు. ఈ మండలికి స్టాట్యుటరీ బాడీ అధికారాన్ని ఇచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ‘ప్రీ యూనివర్సిటీ కోర్స్’గా ఉన్న దీనిని 1969 నుండి ఇంటర్మీడియట్ విద్యగా మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికీ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన సదుపాయాలు, ఏకరూప దుస్తుల (యూనిఫారం) ఏర్పాటు జరగలేదు. వీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు గత ప్రభుత్వం నిరాశను మిగిల్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 జనవరి 2003 నుండి ప్రాథమిక పాఠశాలల్లో, అక్టోబర్ 2008 నుండి ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 9, 10 తరగతులకు 100% రాష్ట్ర నిధులతో 2008 నుండి మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేశారు. ఎన్సీఎల్పీ ‘నేషనల్ చైల్ లేబర్’ ప్రాజెక్ట్ కింద పనిచేసే ప్రత్యేక పాఠశాలలకు (9 సంవత్సరాల పిల్లలు గనులలో కార్మికులుగా పనిచేస్తున్న వారి చదువుకై ప్రవేశపెట్టిన పాఠశాలలు) కూడా ఈ పథకాన్ని 2010 విద్యా సంవత్సరం నుండి అమలు చేశారు. ఆదర్శ పాఠశాలలకు సైతం ఈ పథకాన్ని 2013 విద్యా సంవత్సరం నుంచి వర్తింపజేశారు. 

ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఈ జూన్‌లో ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం నుండి (2024- మధ్యాహ్న భోజన సదుపాయం, ఏకరూప దుస్తుల (యూనిఫారం) పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికే కాక వారు చదువుల్లో రాణించటానికీ ప్రభుత్వం దోహద పడినట్టవుతుంది.

 -షేక్. జాన్ పాష, సెల్: 7386847203