పాటకు పట్టాభిషేకం
గాన గంధర్వుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న జన్మించారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు కూడా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 50 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా ‘బాలు’ అని పిలుచుకుంటారు. నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజినీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికలమీద పాటలు పాడుతూ బహుమతులు సాధించేవారు.
1966లో పద్మనాభం నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంతో సినీ గాయకుడిగా బాలు ప్రస్థానం ప్రారంభమైంది. మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలు గు, తమిళ చిత్రాల్లో పాటలు పాడేవారు. చాలామంది నటులకు వారి హావభావాలు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు. వారి జీవిత భాగస్వామి సావిత్రి. 1969లో మొదటిసారి నటుడిగా కనిపించిన ఆయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లోనూ నటించారు. అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు.
బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ తన ప్రతిభను చాటారు.. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ వంటివాళ్ళకి డబ్బింగ్ చెప్పారు. సినిమాల్లోనేకాక టివీ రంగంలో ఆయన ‘పాడుతా తీయగా’, ‘పాడాలని ఉంది’, ‘స్వరాభిషేకం’ లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఎందరో నూతన గాయనీ గాయకులను వెలుగులోకి తెచ్చారు. బాలుకు కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివిధ విభాగాల్లో 25 నంది పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల నుంచీ పురస్కారాలు అందుకున్నారు. 2012లో ఆయన నటించిన ‘మిథునం’ సినిమాకుగాను ‘నంది ప్రత్యేక బహుమతి’ లభించింది.
ఇంజినీర్ కాబోయి..
బాలు తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. వీరికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. బాలసుబ్రహ్మణ్యం రెండవ సంతానం. బాల్యం నుండే పాటలు పాడటం హాబీగా ఉండేది. చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజినీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కన్నారు. మద్రాసులో ఇంజినీరింగ్ చదువుకుంటున్న సమయంలోనే చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. వారి తొలి చిత్రాని (శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న)కి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు.
సినీ గాయకునిగా జీవితాన్నిచ్చిన కోదండపాణిపై భక్తి, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు ‘కోదండపాణి’ పేరు పెట్టా రు. ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ‘ఏక్ దుజే కేలియే’ లాంటి హిందీ చిత్రాలకూ పాటలు పాడారు. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 16 భాషలలో 50 వేల పాటలు పాడగా, 47 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించడం అరుదైన ఒక ప్రపంచ రికార్డుగా చెప్పాలి. తెలుగు, తమిళంలోనేకాక కన్నడంలోనూ ఆయన పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి.
మాటలోనూ సామ్రాట్టు..
2016 నవంబరులో గోవాలో జరిగిన 47వ ‘అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’లో ‘శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ’ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2016) ప్రదానం చేశారు. 1969లో వచ్చిన ‘పెళ్ళంటే నూరేళ్ళ పంట’ అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు బాలు. 1990లో తమిళంలో వచ్చిన ‘కేలడి కన్మణి’లో బాలు కథానాయకుడిగా నటించారు. ఇందు లో రాధిక నాయిక. ఈ సినిమా తెలుగులో ‘ఓ పాప లాలీ’ పేరుతో అనువాదమైంది.
కె. బాలచందర్ దర్శకత్వంలోని తమిళ అనువాద చిత్రం ‘మన్మధ లీల’తో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ‘దశావతారం’లో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. ‘అన్నమ య్య’ చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, ‘సాయి మహిమ’ చిత్రంలోనూ బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ‘ఉత్తమ డబ్బింగ్ కళాకారుడి’గా నంది పురస్కారం లభించింది.
కామిడి సతీష్ రెడ్డి
సెల్: 9848445134






