31 August, 2026 | 4:58 PM

జేఎన్టీయూలో పార్ట్ టైం బీటెక్

09-06-2024 01:01 AM
  • ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు

సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో ప్రవేశాలు

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికే అవకాశం

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ కోర్సులను పూర్తి చేసి బీటెక్ చేయలేకపోయిన వారికోసం పార్ట్ టైం బీటెక్ కోర్సును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవైపు ద్యోగం చేస్తూనే, ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా బీటెక్ చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అది కూడా సాయంత్రం పూట మాత్రమే. ఇలాంటి ప్రత్యేకతలున్న ఈవినింగ్ బీటెక్ కోర్సులను జేఎన్టీయూ ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనుంది. సివిల్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిం చనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జేఎన్టీయూ వర్సిటీ కావ డంలో ఏఐసీటీఈ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ కోర్సులను నిర్వహించే అవకాశం ఉండగా, ఇటీవలే ఈవినింగ్ కోర్సులను ప్రవేశపెట్టడంపై నిర్ణయం తీసుకున్నారు.

గతంలో ఓయూతో శ్రీకారం

ఈ కోర్సును బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సుగా పిలుస్తారు. గతేడాది నుంచి ఏఐసీటీఈ ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో ఈవినింగ్ బీటెక్ కోర్సులను ప్రారంభించారు. సివిల్, మెకానికల్, ఏఐఎంఎల్ కోర్సులను గతేడాది నిర్వహించగా, ఈ సంవత్సరం ట్రిపుల్‌ఈ కోర్సును ప్రారంభిస్తారు. ఈవినింగ్ ఈ కోర్సును నిర్వహించేందుకు రాష్ర్టంలోని 12 ఇంజినీరింగ్ కాలేజీలకు గతేడాది అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతినిచ్చింది. అయితే పలు కారణాలతో అమలు సాధ్యంకాలేదు. ఈ ఏడాది కొత్తగా నాలుగు కాలేజీలు ఈవినింగ్ బీటెక్ కోర్సులను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులు సమర్పించాయి.

మెథడిస్ట్, స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీ, సీబీఐటీ, అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలు 90 సీట్ల చొప్పున అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించాయి. -స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటాసైన్స్, ఈసీఈ, సీఎస్‌ఈ (ఏఐఎంఎల్) కోర్సుల్లో ఒక్కో కోర్సులో 30 సీట్లకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. -మెథడిస్ట్ కాలేజీ సీఎస్‌ఈ, ఈఈఈ, మెకానికల్‌లో ఒక్కో కోర్సులో 30 చొప్పున 90 సీట్లకు అనుమతి కోరింది. సీబీఐటీ కాలేజీ సీఎస్‌ఈ సివిల్, మెకానికల్ కోర్సుల్లో 90 సీట్లకు, అనుబోస్ కాలేజీ ఈఈఈ, మెకానికల్, మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులో ఒక్కోదాంట్లో 30 చొప్పున మొత్తం 90 సీట్లకు దరఖాస్తు చేసింది.

ప్రవేశాలు ఇలా..

- మూడేండ్ల పాలిటెక్నిక్ (డిప్లొమా) 

పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు.

  ఒక్కో బ్రాంచిలో గరిష్ఠంగా 30 సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కాలేజీలో కనీసం 10 మంది చేరితేనే ఈ కోర్సును నిర్వహిస్తారు. 

  అడ్మిషన్లు కల్పించేందుకు ప్రవేశ పరీక్షను కాలేజీలోనే నిర్వహిస్తారు. అడ్మిషన్లపై తుది నిర్ణయం కాలేజీలదే. 

  ప్రవేశం పొందే వారు ప్రభుత్వ, 

ప్రైవేట్‌రంగాల్లో కనీసం ఏడాదిపాటు వర్కింగ్ ప్రొఫెషనల్‌గా పనిచేసి ఉండాలి.

  ఈ కోర్సులో చేరిన వారికి 

సాయంత్రం లేదా వారాంతాల్లో అడ్మిషన్ పొందిన కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తారు.