22 July, 2026 | 3:05 PM

పేపర్ లీకీలకు బీజేపీ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్

22-07-2026 02:00 PM
  1. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు
  2. నీట్ లీకేజీ, రాహుల్–ప్రియాంక అరెస్టుకు నిరసన
  3. పెద్దపల్లిలో రాస్తారోకో.. మోడీ దిష్టిబొమ్మ దహనం యత్నం

పెద్దపల్లి, జూలై 22: దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు విమర్శించారు. నీట్ పరీక్ష లీకేజీ ఘటనతో పాటు ఢిల్లీలో నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు నాయకత్వం వహించగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, సమాచారం అందుకున్న ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరేష్ తదితరులు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని దిష్టిబొమ్మను తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి రాస్తారోకోను విరమింపజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చింతకుంట విజయరమణరావు, గత 12 ఏళ్లలో దేశంలో పలు కీలక పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నీట్ పరీక్ష లీకేజీ కారణంగా విద్యార్థులు మానసిక వేదనకు గురయ్యారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.