సిరంజిల కొరతతో జిల్లా ఆసుపత్రిలో రోగుల అవస్థలు
భూపాలపల్లి, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రి(Main Hospital)లో సిరంజిల కొరత కారణంగా చికిత్స కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఆసుపత్రిలో వైద్యం కోసం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో రోగులు క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుండగా, అవసరమైన సిరంజిలు అందుబాటులో లేకపోవడంతో మరింత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని మారుమూల గ్రామాలతో పాటు వివిధ మండలాల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలు జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. అయితే ఆసుపత్రిలో సిరంజిలు అందుబాటులో లేకపోవడంతో రోగులు, వారి వెంట వచ్చిన సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా వైద్యం అవసరమైన వారు సైతం సిరంజిల కోసం వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రికి ప్రతిరోజూ వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా సిరంజిలు, ఇతర అవసరమైన వైద్య సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సిరంజిల కొరతను పరిష్కరించి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల నుండి వచ్చిన రోగులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.