65 శాతం రిజర్వేషన్లను రద్దు చేసిన పాట్నా హైకోర్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రాష్ట్రం విధించిన 65 శాతం రిజర్వేషన్ పరిమితిని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచడాన్ని రాజ్యాంగబద్ధంగా సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై మార్చిలో హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. గౌరవ్ కుమార్, ఇతరులు దాఖలు చేసిన 10 రిట్ పిటిషన్లపై మారథాన్ విచారణను ముగిస్తూ చీఫ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.
రిజర్వేషన్ చట్టాల్లో చేసిన సవరణల రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్లు సవాలు చేశారు. నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం సవరించిన రిజర్వేషన్ చట్టాలను చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ,ఈబీసీ, ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతంకి పెంచాలనే లక్ష్యంతో బీహార్ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో అధికారికంగా రాష్ట్ర గెజిట్‌లో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. కొత్త చట్టం 14,15,16 ఆర్టికల్స్ ను ఉల్లంఘిస్తోందని హైకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతులకు అత్యధిక శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత బీహార్ రెండో స్థానంలో ఉంది. తమిళనాడు 50శాతం, బీహార్ వారికి 43శాతం రిజర్వేషన్లు అందించగా, సిక్కిం, కేరళ 40శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాయి.






