4 June, 2026 | 2:15 AM

పవన్ కళ్యాణ్ అపరిచితుడు: కూనంనేని

04-06-2026 01:34 AM

హైదరాబాద్, జూన్ ౩(విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఒక ’అపరిచితుడిలా’ ప్రవర్తిస్తున్నారని సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అనవసరమైన రాద్దాంతం చేయడం వెనుక పవన్ కల్యాణ్ సొంత రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, లేక వేరే ఎవరి కోసమైనా చేస్తున్నారా అని కూనంనేని ప్రశ్నించారు.

ముఖ్యంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి సవాళ్లు విసరడం అంటే.. రెండు ప్రాంతాల మధ్య ప్రాంతీయవాదాన్ని, విద్వేషాలను మళ్లీ రెచ్చగొట్టడమేనని కూనంనేని తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు తన తండ్రి కమ్యూనిస్ట్ అని పదే పదే అన్నారు కదా.. మరి ఇప్పుడు ఆ కమ్యూనిజం ఎక్కడికి పోయిందని నిలదీశారు. సనాతన ధర్మాన్ని అసలు ఎవరు అవమానించారని కమ్యూనిస్టులపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  భవిష్యత్తులో జనసేన పార్టీ కనుమరుగవుతుందేమో గానీ, కమ్యూనిజం సిద్ధాంతం మాత్రం ఎప్పటికీ చచ్చిపోదని కూనంనేని స్పష్టం చేశారు.