మహిళల స్వేచ్ఛకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం
ఎంపీ మల్లు రవి
ఆమనగల్లు, జూన్ 3 (విజయక్రాంతి): మహిళల స్వేచ్ఛకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని, అందుకే గత ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
మహనీయుల ఆశయాల సాధన కోసం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెల రోజుల పాటు 48 మండలాల్లో సాగే ‘మహనీయుల విజ్ఞాన చైతన్య యాత్ర’ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు కడ్తాల్ నుండి ఆమనగల్లు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, మహిళలతో ముచ్చటించి మహాలక్ష్మి పథకం అమలుపై వారి ఆనందాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, కులమతాలకు అతీతంగా 100 ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ స్పష్టం చేశారు.






