13 April, 2026 | 12:24 AM

పెండింగ్ వేతనాలు చెల్లించండి

20-09-2025 12:00 AM

పంచాయతీ కార్మికుల ఆందోళన

అశ్వరావుపేట, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గ్రామపంచాయతీ ల కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సిబ్బంది అందరిని రెండవ పిఆర్సి లోకి తీసుకువచ్చి వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవోకు అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు గ్రామపంచాయతీ కార్మికులకు మొదటి తేదీన వేతనాలు ఇవ్వలేదని అన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామాలలో సర్వం తామే అయి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తుంటే వేతనాలు మాత్రం మూడు , నాలుగు నెలలు పెండింగ్లో పెట్టి కార్మికులను పస్తులతో మాడ్చుతున్నారని అన్నారు.

కార్మికుల పిల్లలకు స్కూల్ ఫీజులు ఇంటి  కిరాయిలు కట్టుకోలేకపోతున్నారని పూట గడవడం కోసం అప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు. ఎన్నికల లో ఇచిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదనారు. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు తాము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం,గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని వాగ్దానాలు చేశారని, కానీ అవి ఏవి అమలు కావటం లేదని అన్నారు.

వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, ప్రమాదం జరిగే మరణించిన సిబ్బంది కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్‌ఐ ప్రమాద బీమా, గ్రాట్యూటీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ అధ్యక్షులు వెంకటప్పయ్య కార్యదర్శి వినోద్ నాయకులు ముత్తారావు,రామారావు మహేష్ వెంకయ్య విజయ్ కన్నారావు రాజు సీతారాములు మంగరాజు పాల్గొన్నారు.