పెండింగ్ వేతనం చెల్లించాలి
- అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
- ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అంగన్వాడి యూనియన్ నాయకులు
నస్పూర్, మే 11 : అంగన్ వాడీల ఏప్రిల్ నెల పెండింగ్ వేతనం వెంటనే చెల్లించాలని, అంగన్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు సోమ వారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ (సీఐటీయు) జిల్లా అధ్యక్షురాలు ఏ భానుమతి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గర్భిణీలకు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
ఐసిడిఎస్ ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కొత్తగా ఇచ్చిన సెల్ ఫోన్స్ సరిగా పనిచేయడం లేదని, వాటిని వెంటనే వెనక్కి తీసుకొని అన్ని యాప్స్, సౌకర్యాలతో ఫైజీ నెట్వర్క్ ఫోన్ ఇవ్వలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు అనురాధ, హీరోనిక తదితరులు పాల్గొన్నారు.






