16 July, 2026 | 11:29 AM

ఆద్యంతం ఆకట్టుకున్న ‘పెంకి పెళ్లాం’

06-12-2024 12:00 AM

‘పెంకి పెళ్లాం’ సినిమా 1956 డిసెంబర్ 6న విడుదలైంది. ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లో ఎన్టీ రామారావు, రాజసులోచన, శ్రీరంజిని జూనియర్ ముఖ్య పాత్రల్లో నటించారు. సాహిణి పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డీబీ నారాయణ, ఎస్ భావనారాయణలు సంయుక్తంగా నిర్మించారు. రంగయ్య (నాగభూష ణం), రత్తమ్మ (హేమల త) దంపతులకు సీత (శ్రీరంజని జూనియర్), రాజు అనే ఇద్దరు పిల్లలుంటారు. రంగయ్యకు మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవలో ఆ వ్యక్తి మరణిస్తాడు. దీంతో రంగయ్యకు శిక్ష పడుతుంది. విషయం తెలుసుకున్న రంగయ్య భార్య రత్తమ్మ కన్నుమూస్తుంది. పిల్లలు అనాథలవడంతో పొరుగున ఉండే పాపయ్య (కేవీఎస్ శర్మ) వారిని చేరదీస్తాడు. కానీ వీరిని పాపయ్య భార్య తాయారు (ఛాయా దేవి), ఆమె సోదరి సుందరమ్మ (సూర్యకాంతం) ఇబ్బందులు పెడుతుంటారు. పాపయ్య కొడుకు వాసు (అమర్‌నాథ్) సీతను ప్రేమించడం.. విషయం తెలుసుకున్న పాపయ్య.. సీతను తప్పుబట్టడంతో ఆమె తన తమ్ముడిని తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆ తరువాత సీత చాలా కష్టపడి తమ్ముడు రాజు (ఎన్టీఆర్)ను ప్రయోజకుడిని చేస్తుంది. ఆ తరువాత రాజు పెద్దింటి అమ్మాయి అయిన సరోజ (రాజ సులోచన)ను ప్రేమించి పెళ్లాడటం.. సీతకు రాజు ప్రాధాన్యతనివ్వడాన్ని సరోజ సహించలేకపోవడం.. వీరి మధ్య గొడవలు, చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.