పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన
తుంగతుర్తి,(విజయక్రాంతి): పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్లు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ పెన్షన్ విధానంతో తీవ్ర నష్టం కలుగుతుందని పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షుడు సంతోష్ అన్నారు.
జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించి, వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పెండింగ్ డిఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య, రమేష్ గౌడ్ సంఘీభావం తెలిపారు. అనంతరం తహశీల్దార్ దయానందంకు మండల పెన్షనర్స్ వినతిపత్రం అందించారు.




