1 May, 2026 | 4:06 AM

కార్మికవర్గ స్ఫూర్తితో ప్రజాపాలన

01-05-2026 01:43 AM
  1. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  2. కార్మిక సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  4. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : కార్మిక వర్గ స్ఫూర్తితో ప్రజాపాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్మిక సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మే డే(మే 1వ తేదీ) సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం కార్మిక వర్గానికి ప్రత్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభా కాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వ పాలనలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

శ్రామికులే తమ ప్రభుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వాములని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. మే డే స్ఫూర్తితో  రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామన్నారు.

తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు తీసుకువచ్చినట్టు తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నా రు. గల్ఫ్ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నట్టు చెప్పారు. 

ఇందిరమ్మ రాజ్యంలో కార్మికుల శ్రేయస్సుకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే శ్రామిక వర్గం కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామని, అలాగే సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తూ కొండంత అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ఇంధన శాఖ పరిధిలోని ట్రాన్‌స్కో, జెన్కో, డిస్కంలలో పనిచేసే ఉద్యోగులకు సైతం రూ.1 కోటి ప్రమాద బీమా భరోసా ఇచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికుల 32 ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్ర భుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.