11 April, 2026 | 1:49 AM

‘రామా‘పురం బీటీ రోడ్డుకు మోక్షమెప్పుడో?

11-04-2026 12:00 AM

పాత బిల్లులంటూ కుంటి సాకులు 

రాజకీయ పరపతి చూపుతున్న కాంట్రాక్టర్

రవాణా సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు 

చారకొండ ఏప్రిల్ 10: ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా చారకొండ- రామపురం బీటి రోడ్డుకు మాత్రం మోక్షం దక్కడం లేదు. నిధులు మంజూరై కాంట్రాక్టర్ పనులు ద క్కించుకున్న ఇతర జిల్లాల్లో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ ఉన్నాయంటూ కుంటి సా కులు వెతుకుతూ రోడ్డు నిర్మాణానికి ముందడుగు వేయడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బడా నేతల వద్ద అడుగులకు మడుగులతో వారి వెంటే తిరుగు తుండడంతో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్ర జాప్రతినిధులు సైతం చారకొండ రామాపురం రోడ్డు నిర్మాణ విషయాన్ని పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. ఫలితం గా చారకొండ రామాపురం, చంద్రాయన్ ప ల్లి, గోకారం గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకుల హామీలు, శంకుస్థాపన లు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నాయనడానికి ఈ బీటీ రోడ్డు పనులే నిదర్శనం.

గతేడాది జనవరి 25న స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ చేతుల మీదుగా రూ.3.50 కోట్ల వ్యయంతో చారకొండ నుంచి రామాపురం వరకు రోడ్డు నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. ఇంకేముంది త్వరలోనే సాఫీగా ప్రయాణించవచ్చని ఆశపడ్డ స్థానిక ప్రజలకు నిరాశే మిగిలింది. ఏడాది దాటుతున్నా నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిన బస్సు సర్వీస్.!

గతంలో ప్రజల విన్నపాల మేరకు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించనా రోడ్డు మొత్తం భారీ గుంతలతో నిండిపోవడం, బస్సు రాకపోకల వల్ల రోడ్డు పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారడంతో అధికారులు బస్సు సర్వీసును నిలిపివేశారు. రోడ్డు నిర్మాణం అయిన తర్వాతే బస్సును పునరుద్ధరిస్తామని చెప్పడంతో గోకారం, చంద్రయాన్ పల్లి, రామపురం గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సదుపాయం లేక ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే రోజూ నడవాల్సిన పరిస్థితి నెలకొన్నది. సొంత వాహనాలు ఉన్నవారు సైతం ఈ రోడ్డుపై వెళ్లాలంటే గుంతలతో, దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్ పేచీ.. పాత బిల్లుల సాకు

ఈ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో తాను చేసిన ఇతర పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, అవి వస్తేనే కొత్త పనులు మొదలుపెడతానని కాంట్రాక్టర్ భీష్మించుక్కూర్చున్నట్లు తెలుస్తోంది. ఈ రహదారి పనుల టెండర్ కంటే తర్వాత టెండర్ పూర్తి అయిన చంద్రయాన్ పల్లి నుంచి రామపురం శివారు వరకు రూ. 4.50 కోట్లతో చేపట్టిన రహదారి పనుల్లో కల్వర్టు నిర్మాణాలు పూర్తి అయ్యాయి.

తుర్కలపల్లి సమీపంలో 4.50 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి పనులు నెల రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు పనులు వేరే కాంట్రాక్టర్ లు చేయడంతో పనులు త్వరగతిన పూర్తి అవుతున్నాయి. కానీ చారకొండ - రామపురం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కు స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే పనులు చేపట్టకపోయినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సంవత్సరం దాటినా పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని టెండర్ రద్దు చేసి మరొకరికి అప్పగించాలని రామపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదుచారకొండ - రామాపురం బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3.50 కోట్ల నిధులు మం జూరు అయ్యాయి. టెండర్ లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పనులు ప్రారంభం అయ్యేలా చూస్తాం..

 దివ్య, పీఆర్ ఏఈ, చారకొండ