అర్ధరాత్రి మట్టి మాఫియా దందా?
గద్వాల టౌన్ ఏప్రిల్ 10 : గద్వాల మండల పరిధిలోని పూడూరు గ్రామ శివారులో అక్రమ మట్టి తవ్వకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.అర్థరాత్రి సమయంలో కోడ గడ్డను జెసిబితో త్రవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన భూములను నిర్భయంగా దోచుకుంటున్న ఈ మట్టి మాఫియా కార్యకలాపా లపై స్థానిక రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పూర్తిగా కళ్లుమూసుకున్నారనే ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి.
రాత్రి వేళల్లో బహిరంగంగానే జరుగుతున్న ఈ అక్రమ రవాణా అధికారులకు కనిపించకపోవడం వెనుక అనుమానాలకు తావిస్తోంది. గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు . అధికారుల సహకారం లేకుండా ఇలా సాగడం అసాధ్యమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యులపై వేటు వేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం... మండల తాసిల్దార్ హరికృష్ణ
అర్ధరాత్రి సమయంలో మట్టి మాఫియా అక్రమ తవ్వకాలు జరిపిన విషయం తమకు తెలియదు .ఈ ఘటనపై సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామంలో ప్రత్యేక పర్యవేక్షణ కోసం సిబ్బందిని ఏర్పాటు చేస్తాం.




