విద్యార్థుల త్యాగాలకు విలువెక్కడ?
తెలంగాణ సిద్ధించి 12 ఏళ్లు గడుస్తున్నా ఇంకా విద్యార్థులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏ విద్యార్థల వల్ల అయితే తెలంగాణ ఏర్పడిందో ఈ రోజు అదే విద్యార్థులు సరైన విద్య అందక అవస్థలు పడుతున్నారు. విశ్వవిద్యాలయాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సరైన వసతులు లేక, సరిపడా లెక్చరర్లు లేక విశ్వవిద్యాలయాల పరిపాలన అగమ్యగోచరంగా మారిపోయింది. గత మూడేళ్ల నుంచి విశ్వ విద్యాలయాల వైస్ చాన్సలర్లపై అక్రమాల ఆరోపణలు రావడం, వారిపై విజిలెన్స్ విచారణలు జరగడం శోచనీయం.
విద్యార్థులు తప్పుచేస్తే దండిచాల్సిన గురువులే తప్పులు చేయడం బాధాకరం. ఈ ప్రభావం విద్యార్థులపై పడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి విద్యావ్యవస్థ అతలాకుతలమైంది. ఈ రోజుకి ఎంతోమంది విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇబ్బందులు పడుతున్నారు. చదువులు పూర్తయిన వారు సర్టిఫికెట్లు చేతికందక కెరీర్‌లో ముందుకువెళ్లలేక ఆగిపోతున్నారు. కొంతమంది అప్పులు తెచ్చి ఫీజు కడుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతున్నది.
విశ్వవిద్యాలయాల్లో కనీస హాస్టల్ వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటాన్ని నిత్యం వార్తలో చూస్తున్నాం. అంతేకాదు, విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అన్యాయాలు నిత్యం వెలుగుచూస్తుండటం విద్యావ్యవస్థ దారుణమైన పరిస్థితిని తెలియజేస్తున్నది. విశ్వవిద్యాలయల విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నతాధికారుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది విశ్వవిద్యాలయాల ఉనికికే ప్రమాదం.
క్యాంపస్‌లో ప్రశ్నించే గొంతులను నిత్యం ప్రభుత్వం నొక్కివేస్తుండటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మేధావులు, విద్యావేత్తలు చేప్తున్నారు. ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపడం, కేసులు బనాయించి వారిని భయభ్రాంతులకు గురిచేయడం, విద్యార్థి సంఘాలను అణచివేయడమే లక్ష్యంగా ఈ వ్యవస్థ ముందుకెళ్తున్నది. ఇదే తెలంగాణ గడ్డపై విద్యార్థులు ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వాలే తలవంచాయి.
అలాంటి చరిత్ర కలిగిన మన విద్యార్థులను ఇబ్బందిపెడుతూ, భమపెడుతూ, అణచివేయడం బాధాకరం. విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులను చక్కబెట్టాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదని అనిపిస్తున్నది. ప్రతి టెండర్‌లో, ఆఖరికి అడ్మిషన్ ప్రక్రియలోనూ అవకతవకలే. వీటివల్ల విశ్వవిద్యాలయాల విశ్వసనీయత దెబ్బతింటున్నది. ఇలాంటి పరిణామాల వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాలే మేలనే అభిప్రాయానికి విద్యార్థులు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో విశ్వవిదాలయాల్లో జరిగే అవకతవకలను విద్యార్థులే ప్రశ్నించాలి, పోరాడాలి.
ప్రశ్నించే గొంతుక ఉంటే వ్యవస్థ గాడితప్పదు. విద్యార్థులతో మమేకమై వ్యవస్థను పటిష్టపరచాల్సిన బాధ్యత లెక్చరర్లపై ఉంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి విశ్వవిద్యాలయాల ఉనికిని కాపాడాలి. విశ్వవిద్యాలయాల్లో కనీస వసతులు కల్పించాలి. క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి. టెండర్లు, అడ్మిషన్లలో అవకతవకలను అరికట్టాలి. ప్రశ్నించే గొంతుకలు, విద్యార్థి సంఘాలపై అణచివేతను ఆపాలి. విశ్వవిదాలయాల సమస్యలను పరిష్కరించకపోతే వాటి విలువ పడిపోయే ప్రమాదం ఉంది. అది విద్యార్థులకు, ప్రభుత్వానికి మంచిది కాదు.
వ్యాసకర్త: జోగు దుర్గాప్రసాద్,
ఆల్ యూనివర్సిటీస్ తెలంగాణ రాష్ట్ర ఏబీవీపీ కోకన్వీనర్






