18 May, 2026 | 12:57 AM

ఏపీ ప్రజలు మార్పు కోరుకున్నారు

20-06-2024 01:00 AM

పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 

హైదరాబాద్, జూన్ 19 ( విజయక్రాంతి) : ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మొదటి సారిగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ 11 స్థానాలకు పరిమితం కావడం ప్రజలు మార్పు కావాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజలు తమ ఓటుకు న్యాయం జరగాలని కోరుకున్నారని పేర్కొన్నారు. వైసిపి అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై గల వ్యతిరేకతకు ఈ ఎన్నికలే  నిదర్శనమని విమర్శించారు. ప్రజలు గట్టి నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఈ సారి కాంగ్రెస్ మంచి  ఫలితాలను తీసుకురాలేక పోయిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు 8 శాతం ఓటు బ్యాంక్ వస్తుందనుకున్నప్పటికీ  ప్రజల నిర్ణయంతో ఇది సాధ్యప డలేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, 2029లో అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం వేశారు. వైసిపి నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. కడప పార్లమెంట్ పరిధిలో చాలా రూరల్ ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ పోటీ చేస్తున్నదన్న విష యమే ప్రజలకు తెలియదని, అందుకే తాను ఓడిపోయినట్లు చెప్పారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, వైఎస్సార్ బతికి ఉంటే ఎప్పుడో పూర్తయ్యేదని పేర్కొన్నారు.  పోలవరంపై శ్వేత పత్రం ఇవ్వాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్ అన్న వైఎస్ శర్మిల ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినట్లు చెప్పారు. రాహుల్ దెబ్బకు బిజెపి చతికలబడిందన్నారు. మణిపూర్ ఘటనతో బిజెపి అరాచకాలు దేశం మొత్తం తెలిశాయని, దాంతో దానికి భారీగా మెజార్టీ తగ్గినట్లు చెప్పారు.