ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు
ప్రాధాన్యతాక్రమంలో రెండు ఫైళ్లపై సంతకాలు
హైదరాబాద్, జూన్ 19 ( విజయక్రాంతి) : ఏపీ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కొణిదెల పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యాలయం నుంచి నేరుగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు,శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు వెంట రాగా, కార్యాలయంలో శ్రీవెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు.
అనంతరం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఆ వెంటనే ఉద్యాన వనపంటలకు, ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే ఫైల్ మీద ఆమోద ముద్ర వేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ అనుమతుల దస్త్రంపై మరో సంతకం చేశారు. పిఆర్ అండ్ డి ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, అటవీశాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా పవన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. =పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
పర్యాటక మంత్రి కందులు దుర్గేష్, ఎంపి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొణతల రామకృష్ణ లోకం మాధవి, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్, వంశీకృష్ణ,ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్దప్రసాద్, అరవ శ్రీధర్, పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, జనసేన నాయకులు కొత్తపల్లి సబ్బారాయుడు తదితరులు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ వెంట ఆయన సోదరుడు నాగబాబు సైతం ఉన్నారు.
ఉన్నతాధికారులతో సమీక్ష
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ తొలిరోజు శాఖాపరమైన విధుల్లో నిమగ్నమయ్యారు. తొలుత పంచాయతీరాజ్,గ్రామీణాబివృద్ధి శాఖలపై సమీక్షలు నిర్వహించారు.






