4 June, 2026 | 1:38 AM

కాప్రా- ఓపెన్ డ్రైనేజీకి మోక్షం ఎప్పుడో?

04-06-2026 12:51 AM

వర్షాకాలం ముందు శాశ్వత పరిష్కారం కోరుతున్న ప్రజలు

కుషాయిగూడ, జూన్ 3 (విజయక్రాంతి): కాప్రా చెరువు మత్తడి నుంచి ప్రారంభమై నాగారం చెరువు వరకు ప్రవహించే ఓపెన్ మురికి కాలువ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతుండగా, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పరిసర కాలనీల ప్రజల్లో ఆందోళన నెలకొంది. కాప్రా, జమ్మిగడ్డ, కుషాయి గూడ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ గాంధీనగర్, ఈస్ట్ గాంధీనగర్, శుభోదయం కాలనీ, మారుతీనగర్, సోనియా గాంధీనగర్, ద్వారకాపురి తదితర కాలనీల గుండా వెళ్లే ఈ మురికి కాలువ చివరకు నాగారం చెరువులో కలుస్తోంది.

గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఓపెన్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, రూ.500 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మేయర్గా ఐదేళ్ల పదవీకాలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, కాప్రా-నాగారం ఓపెన్ డ్రైనేజీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు.

తదుపరి ఎన్నికల్లో ఆయన సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ కార్పొరేటర్గా ఎన్నికై డివిజన్లో పలు అభివృ ద్ధి కార్యక్రమాలు చేపట్టినా, ఈ కీలక సమస్య మాత్రం యథాతథంగానే మిగిలిపోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. పలుమార్లు ప్రతిపాదనలు వచ్చినా కార్యరూపం దాల్చకపోవడంతో సమస్య ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే‘ అన్న చందంగా మారిందని అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పునర్విభజన అనంతరం కుషాయిగూడ, ఏఎస్రావునగర్ డివిజన్లు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో సమస్య పరిష్కారంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ అంశంపై స్థానిక కాలనీ ప్రతినిధులు పలుమార్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికు వినతిపత్రాలు అందజేయగా, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం త్వరలోనే వర్షాకాలం ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో సోనియా గాంధీనగర్, మారుతీనగర్, శుభోదయం కాలనీ, ఈస్ట్ గాంధీనగర్ వంటి ప్రాంతాలు ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేప థ్యంలో కాప్రా చెరువు నుంచి నాగారం చెరు వు వరకు ఉన్న ఓపెన్ డ్రైనేజీని యుద్ధ ప్రాతిపదికన అండర్గ్రౌండ్ డ్రైనేజీగా మార్చి శాశ్వ త పరిష్కారం చూపాలని మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్తో పాటు కాలనీ సంక్షే మ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.