నత్త నడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!
పైలట్ గ్రామంలోనే ఫెయిల్!
ఇందిరమ్మ ఇళ్లకు ఇంద్రజాలం
328 ఇళ్లు మంజూరు.. కట్టింది 100 కూడా లేదు
పైలట్ ప్రాజెక్టులోనే అధికారుల నిర్లక్ష్యం
తాండూరు, జూన్ 2, (విజయక్రాంతి): ఇల్లు లేని పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ఇందిరమ్మ ఇల్లు’ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామంలోనే పథకం అమలు తీరు అధ్వానంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మం బాపూర్ గ్రామానికి 328 ఇళ్లు మంజూరు అయ్యాయి, 134 ఇళ్ల నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టాహాసంగా ము గ్గులు వేసి పనులు ప్రారంభించారు . కానీ ఇప్పటివరకు కనీసం 100 ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు..
పైలట్ ప్రాజెక్టులోనే ఇలానా?
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు మోడల్గా నిలవాల్సిన పైలట్ ప్రాజెక్ట్ గ్రామంలోనే పనులు ముందుకు సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన పథకం క్షేత్రస్థాయిలో అమలు కాకపోతే ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ‘మంజూరైన 328 ఇళ్లలో పునాది పడింది కేవలం 50-60 ఇళ్లకే. మిగతావి కాగితాలకే పరిమితం‘ అని స్థానికులు అంటున్నారు.. ఆరు నెలలైనా ఇళ్ల నిర్మాణానికి పునాది పడకపోవడంతో అద్దె ఇళ్లల్లో ఇరుకైన గదుల్లోనే లబ్ధిదారుల అవస్థలు పడుతున్నారు.
కారణం ఏమిటి?
ఇసుక కొరత, బిల్లులు రాకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు లబ్ధిదారులకు ఇప్పటికీ వర్క్ ఆర్డర్లు కూడా అందలేదని సమాచారం. ‘ఇల్లు మంజూరైందని సంబరపడ్డాం. కానీ ఆరు నెలలైనా ఒక్క ఇటుక కూడా పడలేదు. అద్దె ఇళ్లలో ఎన్నాళ్లు ఉండాలి? అని మహిళా లబ్ధిదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామంలోనే పనులు నత్త నడకన సాగుతుంటే మిగతా గ్రామాల పరిస్థితి ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. దీనిపై హౌసింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, లబ్ధిదారులకు అవగాహన కల్పించి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పథకం నీరుగారుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ విషయమై ఎంపీడీవో తిరుమల స్వామిని వివరణ కోరగా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదని. .ప్రారంభంలో ఉత్సాహం కనబరిచిన వారు ‘నాట్ విల్లింగ్‘ లో ఉన్నారని తెలిపారు. కొన్ని ఖచ్చితమైన నిబంధనల వల్ల లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారని అన్నారు.






