4 September, 2026 | 3:03 PM

శిథిలావస్థలో ఆశ్రమ పాఠశాల.. విద్యార్థుల ఆవేదన

04-09-2026 | 01:37pm

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లా కాగజ్‌నగర్‌(Kagaznagar)లోని ఎస్టీ బాయ్స్ ఆశ్రమ పాఠశాల(ST Boys' Ashram School)ను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు(Harish Rao) శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్ రావు తదితర ప్రజాప్రతినిధులతో కలిసి పాఠశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలో అందుతున్న వసతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు యూనిఫారాలు(Uniforms), సాక్సులు, టై, బెల్టులు(Belts), ఐడీ కార్డులు(ID cards) అందలేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాలలోని వాటర్ ప్లాంట్ సుమారు ఆరు నెలలుగా పనిచేయడం లేదని విద్యార్థులు తెలిపారు.

తాగునీటికి సరైన సౌకర్యం లేకపోవడంతో స్నానానికి వినియోగించే నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని, ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయాందోళనకు గురవుతున్నామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు వెల్లడించిన సమస్యలను హరీశ్‌రావు స్వయంగా విని, పాఠశాలలోని వసతులు, తాగునీటి పరిస్థితి, భవనాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.