11 May, 2026 | 9:43 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'

11-05-2026 08:59 PM

​- మోదీ ఫేస్‌బుక్ ఖాతాలో అప్పన్నపేట కళాకారుల విన్యాసం

- జిల్లా కళాకారుల ప్రతిభకు దక్కిన అరుదైన గౌరవం

గరిడేపల్లి,(విజయక్రాంతి): గ్రామీణ కళాకారుల నైపుణ్యం దేశ ప్రధాని నరేంద్ర మోదీని మంత్రముగ్ధులను చేసింది. మండలంలోని అప్పన్నపేట గ్రామానికి చెందిన ' సతీష్ మ్యూజిక్ అకాడమీ' బృందానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ బృందం ప్రదర్శించిన డప్పు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.​ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని మోదీ ర్యాలీగా వస్తున్న సమయంలో సతీష్ మ్యూజిక్ అకాడమీ బృందం డప్పుల దరువుతో, కళ్లు చెదిరే విన్యాసాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శనకు ప్రధాని ముగ్ధులయ్యారు.ఈ క్రమంలో మన కళాకారులు చేసిన విన్యాసానికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోదీ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం విశేషం.కోట్లాది మంది అనుసరించే ప్రధాని సోషల్ మీడియా ఖాతాలో తమ ఫోటో చోటు చేసుకోవడంపై సతీష్ మ్యూజిక్ అకాడమీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు "మా కళకు దక్కిన అతిపెద్ద గౌరవం ఇది. మారుమూల గ్రామానికి చెందిన మా ప్రతిభను దేశం చూసేలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది" అని బృందం సభ్యులు తెలిపారు.

ఇంతటి గొప్ప వేదికపై అవకాశం కల్పించిన గడ్డం హిమగిరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి సుమారు 150 మంది డప్పు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాన్ని చాటారు. గ్రామీణ కళలకు సరైన గుర్తింపు లభిస్తే వారు ఎంతటి ఎత్తుకైనా ఎదగగలరని ఈ సంఘటన నిరూపించింది. ప్రధాని చేత అభినందనలు పొందిన అప్పన్నపేట కళాకారులను గ్రామస్తులతో పాటు జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు