విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం
- టోల్ ఫ్రీ నంబర్ 1912
ఉప ముఖ్యమంత్రి భట్టి
ఖమ్మం, జూన్ 16 (విజయక్రాంతి): విద్యుత్తు సమస్య వచ్చినప్పుడు అధికారులు అందుబాటులో ఉండటం లేదని కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సమస్యల శాశ్వత పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మొట్టమొర్రిలో రూ.౨ కోట్ల విలువైన రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రం లో ఎక్కడైనా విద్యుత్తు సమస్య ఎదురైతే 1912 నంబర్‌కు ఉచితంగా ఫోన్ చేయవచ్చని తెలిపారు.
ఫిర్యాదు అందిన వెంటనే విద్యుత్తు అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ఫిర్యాదులు అన్ని ఆన్‌లైన్‌లో నమోదవుతాయని పేర్కొన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీలో వాస్తవ పరిస్థితులను శ్వేత పత్రం ద్వారా చర్చకు పెట్టామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.






