25 May, 2026 | 1:46 AM

కరిగిపోతున్న ఖమ్మం!

17-06-2024 12:09 AM
  • మట్టిమాఫియా చేతుల్లో జిల్లా గుల్ల

గుట్టలు, చెరువులు సర్వం స్వాహా

అంతర్ రాష్ట్రీయంగా సాగుతున్న దందా

అభివృద్ధి ముసుగులో సరిహద్దులు దాటుతున్న మట్టి

అడ్డుకోలేకపోతున్న జిల్లా అధికార యంత్రాంగం

ఖమ్మం, జూన్ 1౬ (విజయక్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా మట్టి మాఫియా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నది. ఎలాం టి అనుమతులు లేకుండానే యధేచ్చగా తవ్వకాలు జరుపుతోంది. ఖమ్మం చుట్టుపక్కల వస్తున్న ఎక్స్‌ప్రెస్ హైవేస్ కు అవసర మైన గ్రావెల్ కోసం వేలాది ట్రక్కుల్లో మట్టి పగలనకా రాత్రినక తరలిపోతోంది. ఈ ముసుగులో  ఆంధ్రప్రదేశ్ లోని వెంచర్లకు మట్టి రవాణా సాగుతోంది.  ప్రభుత్వానికి దక్కాల్సిన సీనరేజి టాక్స్ ఎగ్గొడుతూ  మట్టి వ్యాపారానికి తెగబడుతున్నారు. 

తాత్కాలికంగా అనుమతులు రద్దు చేసినా అధికారుల కనుసన్నల్లో గుట్టుగా మట్టిమాఫియా నిరాటంకంగా సాగుతోంది.  మొన్నటి వర కు మండల స్థాయి బీఆర్‌ఎస నాయకులు అధికారం అడ్డంపెట్టుకుని మట్టి తవ్వకాలు కొనసాగించారు.  ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ మారి మరీ మట్టిదందా కొనసాగిస్తున్నారు.  కామేపల్లితో పాటు మధిర మండలం సిరిపురం సమీపంలోని ఎండవల్లి గుట్టలు క్రమంగా కరిగిపోతున్నాయి. సర్వేనంబర్ 61, 62, 73ల్లోని దాదాపు 250 ఎకరాల్లో ప్రభుత్వ భూములకు సరిహద్దులు లేకపోవడంతో తవ్వకాలకు అంతం లేకుండా పోతోంది. 

ఏపీ వెంచర్లకు తరలింపు 

కల్లూరు మండలం చిన్నకోరుకొండి, చెన్నూరు, చండ్రుపట్ల వెన్నవల్లి, లక్ష్మీపురం గ్రామాల పరిధిలోని చెరువుమట్టి ఆంధ్రప్రదేశ్‌లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలుతోంది. కొణిజర్ల మండలం తీగలబంజర గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తోడేస్తున్నారు.   ఎర్రుపాలెం మండలం గుంటుపల్లి గోపవరం గ్రామపంచాయతీ పరిధిలోనూ మట్టి మాఫియా అడుగు పెట్టింది.   ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వెలుగుమట్ల వద్దగల ఎన్‌ఎస్‌పి భూముల్లో భారీ ఎత్తున తవ్వకాలు జరిగాయి. అలాగే గొల్లగూడెం చెరువులో ఇటీవల అర్ధరాత్రి వేళ సాగుతున్న మట్టి తవ్వకాలపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయగా,  అనకొండలు అక్కడి నుంచి ఉడాయించారు. కొణిజర్ల మండలం తీగలబంజరు తరువాత రామనర్సయ్యనగర్, సాలెబంజర, క్రాంతినగర్, లక్ష్మీపురం వరకుగల అటవీ బంజరుభూముల్లో  డోజర్లు, జేసీబీల సాయంతో మట్టి రోజురోజుకు మాయమవుతోంది.

పోడు హక్కు పత్రాలు ఉన్నాయంటూ  ఈ రకం దందాకు తెరలేపారు.  పెనుబల్లి మండలం లింగగూడెం  రెవె న్యూ పరిధిలోని చిలకలగుట్టలో తెల్లరాయి తవ్వకాల కోసం మైనింగ్‌శాఖ అనుమతులు పొందిన ప్రైవే టు వ్యక్తులు  ఇక్కడి నుంచి మట్టిని తవ్వి ఆంధ్రాకు తరలిస్తున్నారు. స్టానిక గిరిజనులు అడ్డుకుని ఫిర్యాదు చేసినాగానీ మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తు న్నారు. గత ప్రభుత్వంలో అక్రమమైనింగ్ కు పాల్పడ్డ మట్టి మాఫియా  ఈ ప్రభుత్వంలో  కూడా  ప్రభు త్వ గుట్టలు భూముల్ని  యథేచ్ఛగా చదును చేసేస్తున్నది. కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామ సమీపంలోని రెండు పెద్ద ఇటుక బట్టీలకు  ఇప్పటికే సు మారు 800 ట్రిప్పుల వరకు మట్టి డంపింగ్ జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.   

ఖమ్మం పరిసర ప్రాంతాల్లో గుట్టలు చదును చేసిన మట్టి మాఫియా  కొణిజర్ల మండలంలో కూడా  తవ్వకాలకు తెరలేపింది. వైరా నియోజక వర్గంలోని కొందరు రాజకీయ నాయకుల అండదండలతో మట్టిని మింగేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం చెరువులో రైతుల పేరిట అనుమతులు పొంది వెంచర్లు, ఖాళీ స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇండ్ల నిర్మాణాలకు మట్టి తరలిస్తున్నారు.  ట్రక్కుకు రూ.650 నుంచి 800 వరకు దూరాన్ని బట్టి ఛార్జి చేస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎక్స్‌ప్రెస్ వేస్‌కు పెద్దమెత్తంలో తరలించే బ్యాచ్ వేరేగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా  వైరాలోని వైరా రిజర్వాయర్, సోమవరంలోని నల్లచెరువులో కూడా మట్టి తవ్వకాలు జరుగుతు న్నాయి. 

కామేపల్లి మండలంలో చెరువు మట్టి ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు.  పండితాపురంలోని కొండారెడ్డి చెరువు, చాకరేయికుంట, ముత్యాలమ్మకుంట చెరువుల్లో కూడా  రైతుల పేరిట మట్టితవ్వకాలు సాగిస్తున్నారు.  ఎకరానికి గరిష్టంగా 30 ట్రిప్పులు మాత్రమే మట్టి తవ్వేందుకు అనుమతులు పొందిన ముదిగొండ మండలంలోని పలు గ్రామాలనుంచి  వందలకొద్ది ట్రిప్పులు తరలిస్తున్నారు. కూసుమంచి మండలం జుజ్జల్‌రావుపేట,  గట్టుసింగారం, తురకగూడెం, కూసుమంచి చెరువుల నుంచి ఏకంగా జేసీబీల సాయంతో తవ్వకాలు సాగుతున్నాయి. తల్లాడ గుంటి చెరువులో పెద్దెత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. మామూళ్ల మత్తులో పడి రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.