8 August, 2026 | 10:49 PM

వడ్డెరల ఉపాధికి అనుమతులు ఇవ్వాలి

08-08-2026 09:45 PM

మెదక్ జిల్లా అధ్యక్షుడు దండుగుల దుర్గా సాయిలు

కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంచెట్టిపల్లి చౌరస్తాలోని హనుమమ్మ ఫంక్షన్ హాల్‌లో శనివారం వడ్డెర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ జిల్లాలోని వివిధ మండలాల వడ్డెర సంఘం అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొని వడ్డెరల సమస్యలు, జీవనోపాధి, ఉపాధి అవకాశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల దుర్గా సాయిలు మాట్లాడుతూ.. వడ్డెరల జీవనం రాళ్లతో ముడిపడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తాతల కాలం నుంచి తండ్రుల వరకు, ప్రస్తుతం తమ కుటుంబాలు కూడా రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం రాయి కొట్టే వృత్తికి అడ్డంకులు ఏర్పడటంతో వడ్డెర కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలోని అనేక వడ్డెర కుటుంబాలకు కనీసం గుంట భూమి కూడా లేదని, చాలామందికి సొంత ఇళ్లు లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. “మా బతుకు రాయిపైనే ఆధారపడి ఉంది. రాయి కొట్టడమే మా జీవనోపాధి. ఆ వృత్తిని కూడా అడ్డుకుంటే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి?” అని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా ప్రతి మండలంలో అటవీశాఖ అధికారులు రాళ్లు కొట్టే తమ సంప్రదాయ వృత్తిని అడ్డుకుంటున్నారని దుర్గా సాయిలు తెలిపారు.

ఉపాధి కోల్పోవడంతో అనేక వడ్డెర కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల సమయంలో కూడా తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డెరలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా జరుపటి జైపాల్‌ను, తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్‌గా గుంజ రేణుకను నియమించడం పట్ల వడ్డెర సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

అడవుల్లోని బండలపై రాయి కొట్టేందుకు అనుమతులు ఇవ్వాలి

తెలంగాణ ముఖ్యమంత్రి తమ వడ్డెరల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించి జీవనోపాధి కోసం అడవుల్లో ఉన్న అనుమతించదగిన బండలపై రాయి కొట్టుకునేందుకు చట్టబద్ధమైన అనుమతులు కల్పించాలని దుర్గా సాయిలు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను పాటిస్తూ, అటవీశాఖ సంబంధిత అధికారుల పర్యవేక్షణలో వడ్డెరలకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించాలని కోరారు.

వడ్డెర కుటుంబాలకు భూమి, గృహాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సంప్రదాయ వృత్తిని కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమావేశంలో నాయకులు కోరారు. వడ్డెరల బతుకులు రాయితో ముడిపడి ఉన్నాయని, ఆ రాయిని దూరం చేస్తే వారి జీవనాధారం కూడా దూరమవుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు దుర్గ సాయిలు, కొల్చారం మండలం అధ్యక్షులు ఓర్స  ఈశ్వర్, దారంగుల ఎల్లయ్య, ఎత్తరి పెంటయ్య, వల్లపు శ్రీనివాస్, సంపంగి రమేష్, జరుపటి రాజు, హనుమంతు, వెంకటేశం, యాదగిరి, నిఖిల్, రమేష్, ఎల్లేష్, కుమార్, నాగయ్య, శివరాములు, పోచయ్య, నాగరాజ్, వీరేశం వడ్డెర నాయకులు తదితరులు పాల్గొన్నారు.