24 April, 2026 | 10:16 AM

చపాతీ రోలర్‌పై పిటిషన్ వాపస్

27-06-2024 12:24 AM

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ప్రజాప్రాతినిధ్య చట్టం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు చెప్పింది. దీంతో చపాతీ రోలర్ గుర్తును ఎంపిక జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల గుర్తు జాబితాలో ‘చపాతీ రోలర్’ను చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పిటిషన్ వేసింది. దీనిని బుధవారం చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం విచారించింది. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిటిషనర్ పార్టీ అభ్యర్థులు చపాతీ రోలర్ గుర్తుపై పోటీ చేశారని లాయర్ అన్నారు.

మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని కోరారు. ఈసీ తరఫు న్యాయవాది జీ విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఫలానా గుర్తు కావాలని ఎవరూ కోరలేరని చెప్పారు. చట్టప్రకారం వెసులుబాటు లేనందున ఉన్న జాబితా నుంచే ఏదో ఒక గుర్తు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్ లాయర్ కోరడంతో అందుకు హైకోర్టు అనుమతించింది.