సీఎంఆర్ సేకరణలో సిత్రాలు!
సూర్యాపేట, జూన్ 7 (విజయక్రాంతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యం మరాడించి ఇవ్వడానికి మిల్లర్లుకు కేటాయిస్తే అవి తిరిగి సేకరించడంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. జిల్లాలో కొన్ని సీజన్‌లకు సంబందించి కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యం మిల్లర్ల నుంచి రాబట్టడంంలో అధికారులు ఉదాసీనత కనబర్చుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణలో అన్ని మిల్లులను ప్రభుత్వ నిబంధనల మే రకు సమానంగా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉంటుంది. అయితే ప్రభుత్వం మా రక ముందు కొన్ని మిల్లులను టార్గెట్ చేసిన జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు, అప్పుడు వదిలేసిన మిల్లులను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు మిల్లర్ల ముఖం చేసి బొట్టు పెడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆ మిల్లుల్లో ఎందుకు తనిఖీ చేయరు?
2023 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇంకా 1,35,186 మెట్రిక్ టన్నుల రైస్ మిల్లర్లు బకాయి ఉన్నారు. ఈ సీజన్ సీఎంఆర్ సేకరణకు ఇంకా గడువు ఉంది. కానీ, అధికారులు కొన్ని మిల్లుల్లో మాత్రమే తనిఖీ చేసి మిగిలిన మిల్లులను వదిలేశారు. ఈ సీజన్ బకాయిల విషయంలో కేసులు నమోదైన మూడు మిల్లులతో పాటు ఏఎస్‌ఆర్, శ్రీసంతోషిమాత, తిరుమల రైస్ ఇండస్ట్రీ, ఎంకేఆర్, వెంకటసాయి ఇలా అనేక మిల్లులు అధిక మొత్తంలో సీఎంఆర్ బకాయే ఉన్నాయి. ఏఎస్‌ఆర్ మిల్లుకు 10,524 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా 7,051 మెట్రిక్ టన్నుల రైస్ అందించాల్సి ఉంటే కేవలం 985 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇక సంతోషిమాత రైస్ మిల్లుకు 9,452 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా 6,333 మెట్రిక్ టన్నుల బియ్యం బదులు 202 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించారు.
తిరుమల రైస్ ఇండస్ట్రీకి 8,140 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా 5,433 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. కానీ, కేవలం 115 మెట్రిక్ టన్నులు మాత్ర మే అందించారు. ఎంకేఆర్ మిల్లుకు 5,841 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయిస్తే కేవలం 260 మెట్రిక్ టన్నుల రైస్ ఇచ్చారు. ఈ మిల్లులన్ని కేసులు నమోదైన మిల్లుల కంటే తక్కువగా సీఎంఆర్ ఇచ్చాయి. కానీ, వీటి వైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. ఈ మిల్లుల్లో ధాన్యం నిలువలపై అనుమానాలు ఉన్నా అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీని వెనుక రూ. లక్షల్లో చేతులు మారాయని చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సివిల్ సప్లయ్ అధికారులను వివరణ కోరగా పైఅధికారుల ఆదేశాల మేరకు మూడు మిల్లుల్లో మాత్రమే తనిఖీ చేశామని చెప్పడం గమనార్హం.
కొన్ని మిల్లులపైనే కేసులు
‘సీఎంఆర్ సేకరణ ప్రక్రియ పూర్తిగా సివిల్ సప్లయ్ అధికారుల కనుసన్నల్లో జరుగనున్నది. మిల్లులకు ధాన్యం కేటాయింపు నుంచి సీఎంఆర్ సేకరణ వరకు వారిదే పూర్తి బాధ్యత. వారి వద్ద మిల్లులకు కేటాయించిన ధాన్యం, మిల్లర్లు అందించిన సీఎంఆర్ లెక్కలు పక్కాగా ఉండాలి. అదే విధంగా అందించిన సీఎంఆర్, మిగిలిన ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అయితే ఈ తంతులో జిల్లా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కొంతమంది మిల్లర్లను వెనకేసుకొస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు వారి లెక్కలే అద్దం పడుతున్నాయి. 2023 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 64 మిల్లులకు 2,08,175 మెట్రిక్ టన్నుల ధాన్యం అందించారు.
ఇందుకు 1,39,477 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 42,913 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సేకరించారు. ఇందులో కేవలం 3 మిల్లులు 100 శాతం టార్గెట్ పూర్తి చేశాయి. అయితే ఈ సీజన్ సీఎంఆర్ అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సంతోషి, రఘురామ, శ్రీవెంకటేశ్వర మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ధాన్యం నిల్వలు లేవని గుర్తించిన అధికారులు వారిపై కేసు నమోదు చేసి రెండు మిల్లుల యాజమానులను అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ మిల్లుల కంటే తక్కువ బియ్యం అందించిన మిల్లులు కూడా ఉన్నాయి. వాటిలో కనీసం తనిఖీలు కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.






