3 August, 2026 | 8:01 AM

సిసోడియాకు బెయిల్ నిరాకరణ

22-05-2024 02:39 AM

ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి

సాక్ష్యాలు ధ్వంసం చేయడంలో ఆయనది కీలక పాత్ర 

బెయిల్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు 

సుప్రీం కోర్టుకు వెళ్తామంటున్న ఆప్ నేతలు

న్యూఢిల్లీ, మే 21: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆయన కేసుకు సంబంధించి కీలకమైన సాక్ష్యాలను, ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారని, ఆయనకు చాలా పలుకుబడి ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీకి ప్రజల మద్దతు ఉందని సిసోడియా నమ్మబలికారని, అయితే వాస్తవానికి ఆ లిక్కర్ పాలసీ కొందరికి లబ్ధి చేకూర్చేలా ఉందని కోర్టు పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి సిసోడియా తీహార్ జైలులోనే ఉన్నారు.

ఈ కేసులో బెయిల్ కోసం పలుసార్లు పిటిషన్లు వేసినా ఆయనకు ఊరట లభించలేదు. తాజాగా ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, మరోసారి ఆయనకు బెయిల్ నిరాకరించింది. ఇక, ఇదే కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది.