17 July, 2026 | 7:40 PM

యాదాద్రి కొండపై ప్లాస్టిక్ నిషేధం

03-06-2024 12:58 AM

అవగాహన ర్యాలీ నిర్వహించిన సిబ్బంది

యాదాద్రి భువనగిరి, జూన్ 2 (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఆలయ పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు భక్తులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించడానికి ఆదివారం కొండపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాస్కర్‌రావు మాట్లాడుతూ.. జూన్ 15 నుంచి సంపూర్ణంగా కొండపై వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు. యాదగిరిగుట్టలో స్థానికులకు అంతరాలయ ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణ యం తీసుకున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ భాస్కర్‌రావు తెలిపారు.

ఆదివా రం ఆయన కొండపై విలేకరులతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా స్థానికులు స్వామి వారిని అంతరాలయ దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా ఉన్నదని, ఆలయ పున:నిర్మాణం తర్వాత దానిని కొనసాగించకపోవడంతో యాదగిరిగుట్ట ప్రాంత భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్థానికులకు గతంలో కొనసాగిన అంతరాలయ దర్శనాలను పునరుద్ధరించాలని కోరారని, ఆలయానికి పెరిగిన రద్దీ కారణంగా గతంలో మాదిరి శనివారం కాకుండా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 5.30 వరకు సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చే స్థానికులకు అంతరాలయ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

లక్ష్మీనరసింహుడికి లక్ష పుష్పార్చన

లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో ఏకాదశి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి గర్భాలయంలో నిత్య కైంకర్యాలను నిర్వహించిన అనంతరం లక్షనామ స్తోత్రావళి పారాయణాలతో పుష్పార్చన జరిపారు. కాగా, స్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి రూ.78,59,736 నిత్య ఆదాయం వచ్చినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు.