శిథిల భవనాలకు నోటీసులు
గ్రేటర్‌లో 485 భవనాలు గుర్తింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, గోడలు కూలిపోతున్న కారణంగా అనేక సందర్భాలలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి ఏడాది శిథిల భవనాలను గుర్తించి నోటీసులు ఇవ్వడానికి మాత్రమే టౌన్ ప్లానింగ్ విభాగం పరిమితం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ తరహా భవనాలను ప్రతి ఏడాది గుర్తించినా ఫలితం ఉండటం లేదు. సాధారణంగానే కురుస్తున్న వర్షాలకు భవనాల శిథిలాలు, ప్రహరీ గోడలు పడిపోతున్నాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉంటున్న అమా యకుల ప్రాణాలు పోతున్నాయి. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ ఆదేశాల మేరకు శిథిల భవనాలను గుర్తించి చర్యలు తీసుకోవడానికి జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదు..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో దాదాపు1.40 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. 19 లక్షలకు పైగా భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో కురిసే చిన్నపాటి వర్షానికే గోడలు నాని కూలిపోతున్నాయి. దీంతో ప్రమాదాలు చోటుచే సుకొని ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులే అత్యధికంగా ప్రాణాలు కోల్పోవడం, గాయా ల పాలవడం జరుగుతోంది. మైలార్‌దేవ్ పల్లి డివిజన్‌లో సోమవారం గోడ కూలి వలస కూలీల పిల్లలు ముగ్గురు మరణించా రు. మరో నలుగురు పిల్లలు చికిత్స పొందుతున్నారు.
ఇటీవల నగరంలో కురిసిన వర్షానికి శేరిలింగంపల్లి పరిధిలో మొదటి అంతస్తులోని బాల్కనీ ప్రహరీ కూలి కింద ఉన్న రేకుల ఇంటిపై ఇటుకలు, రాళ్లు పడిపోవడంతో.. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహన దారులకు తగిలి అక్కడికక్కడే ఒకరు చనిపో గా, మరొకరు చికిత్సపొందుతూ మరణించారు. ఇలా నగరంలో ఈ తరహా ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి. ఇలాంటివి చోటుచేసుకుంటున్న సమయంలో జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం ప్రమాద కారణాలను తెలుసుకొని సంబంధిత చర్యలకు పూనుకోకపోవడంతో వారు ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
485 భవనాలకు నోటీసులు
గ్రేటర్‌లో సికింద్రాబాద్, ఖైరతాబా ద్, చార్మినార్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్‌బీ నగర్ జోన్ల పరిధిలో అధికారులు 485 శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించారు. గ్రేటర్‌వ్యాప్తంగా 30 సర్కి ళ్లలో గుర్తించిన శిథిల భవనాలకు అధికారులు నోటీసులను అందజేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండడంతో రెండో విడత నోటీసులు, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కొంత జాప్యం జరుగుతోంది. కౌంటింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. అనంతరం అధికారికంగా ఎన్నికల కోడ్ ముగియగానే ఈ భవనాలకు రెండో విడత హెచ్చరిక నోటీసులు ఇవ్వనున్నట్టు టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈ భవనాలను కూల్చివేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు చెబుతున్నారు.






